ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికీ మార్గనిర్ధేశకులుగా నిలవాలి, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానోత్సవంలో రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి,

 

పత్రిక ప్రకటన

తేదీ : 05–09–2022

ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది గురువులు భగవంతుని స్వరూపాలు,
ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికీ మార్గనిర్ధేశకులుగా నిలవాలి,
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానోత్సవంలో రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి,
జిల్లా వ్యాప్తంగా 57 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాల అందచేత,
ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని వారు భగవంతుని స్వరూపాలని ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికీ మార్గనిర్ధేశులుగా నిలిచి రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును అందించాలని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని షామీర్పేట జిల్లా సమీకృత భవనాల సముదాయంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రధానోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఉపాధ్యాయులంటే తనకెంతో గౌరవం, ఇష్టమని వారు ఇతరులకు మార్గనిర్ధేశకులుగా నిలవాలని ఈ వృత్తి ఎంతో పవిత్రమైనదని పది మందికి దారిచూపే వారు ఉపాధ్యాయులని అన్నారు. సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని పండగ వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఉపాధ్యాయుడుగా ఉన్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ , ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి అయ్యారని ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళాలని మంత్రి అన్నారు. ఉపాధ్యాయులంటే ప్రతి ఒక్కరికీ గౌరవం ఉంటాయని భావితరాలకు మంచి భవిష్యత్తును అందించేందుకు ఉపాధ్యాయులు తమవంతు ఎంతో కృషి చేయాలని మంత్రి మల్లారెడ్డి ఆకాంక్షించారు. ప్రస్తుతం డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయుల వద్ద పాఠాలు నేర్చుకొన్న తర్వాతనే ఉన్నత స్థాయికి ఎదుగుతారని దీనిని గుర్తెరగాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. గురువులు లేని విద్యకు విలువలేదని అందుకే గురువు బోధించే విద్య ఎంతో విలువైందని, పవిత్రమైనదన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించి వారు అనుకున్న గమ్యాలను చేరుకోవడానికి ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంటుందని మంత్రి వివరించారు. ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయులను గౌరవిస్తారని వారు కూడా సమాజానికి మంచి చేసేలా విద్యార్థులను తీర్చదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తల్లిదండ్రుల తర్వాత గురువులకు స్థానం కల్పించడం ద్వారా ఉపాధ్యాయ వృత్తికి ఉన్న గౌరవాన్ని తెలియచేస్తోందని వారి కృషి మరువలేనిదని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ అందరికీ విద్యనందించేందుకు రూ.7,200 కోట్లు కేటాయించారని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నిలిపేందుకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రెండు లక్షల మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు తీసుకోవడం ప్రభుత్వం చదువుపై చూపుతున్న శ్రద్ధకు నిదర్శమని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పయనిస్తోందని ఇది ఎంతో ఆనందకరమని అన్నారు.
జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఉపాధ్యాయులను తమకు మార్గదర్శకులుగా తీసుకుంటారని ఉపాధ్యాయులకు సమాజంలో ఎంతో గౌరవ మర్యాదలు ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థులు సైతం తమకంటూ ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దానిని సాధించేందుకు కృషి చేస్తే అందుకు ఉపాధ్యాయుల తోడ్పాటు తప్పక లభిస్తుందని వారి ద్వారానే అనుకున్న లక్ష్యాలను సాధించడానికి వీలవుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిపై మరింత బాధ్యత పెరుగుతుందని వారు ఇతరులకు దిక్సూచిగా నిలవాలని జడ్పీ ఛైర్మన్ శరత్చంద్రారెడ్డి ఆకాంక్షించారు.
అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఇతర వృత్తిలో కంటే ఉపాధ్యాయ వృత్తిలో తమ విద్యార్థి ఉతీర్ణత చెంది ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు కలిగే సంతృప్తి ఎక్కువ అని, మరవరానిదని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలో ప్రతిరోజూ ఛాలెంజింగ్ గా ఉంటూ విద్యార్థుల ఉన్నతికి కృషి చేస్తున్నారని, పిల్లల బాగు చూసే తల్లిదండ్రుల తర్వాతి స్థానంలో ఉండి వారి జీవితాన్ని, తరాలను ఉజ్వల భవిష్యత్తు వైపుకు తీసుకెళ్లే శక్తి కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఉన్నదని తెలిపారు.
అదనపు కలెక్టర్ శ్యాంసన్ మాట్లాడుతూ విద్యార్థికి ఉపాధ్యాయులకు మధ్య మంచి సంబంధాలు ఉండాలని, విద్యార్థులు వారి లక్ష్యం వైపు నడిచేలా ఉపాధ్యాయులు నిరంతరం మార్గదర్శకం చేయాలని సూచించారు.
జిల్లా విద్యా శాఖాధికారి విజయ కుమారి మాట్లాడుతూ, తల్లిదండ్రులు తర్వాత విద్యార్థి దశ నుండి ఉన్నత స్థానంలోకి వచ్చే వరకు లోకంలో ఎలా నడుచుకోవాలి అనే విషయాలపై అవగాహన కల్పించడం తో పాటు, విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఒక గౌరవ ప్రదమైన స్థానంలో ఉండేందుకు అవకాశం, సహకారం కల్పించేవారు ఉపాద్యాయులు అని, అందుకే పెద్దలు మాతృదేవో భావ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారని తెలిపారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులను సన్మానించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఎంపికైన 57 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను అందచేసి శాలువా, జ్ఞాపికలతో వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారి, మేడ్చల్ ఎంపీపీ రజిత రెడ్డి, జడ్పీటీసీలు శైలజ రెడ్డి, అనిత, జవహర్ నగర్ మెయర్ కావ్య, జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post