ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు ఎలాంటి అపోహలకు అవకాశం ఇవ్వకుండా అత్యంత పారదర్శకంగా పూర్తి అయ్యేవిధంగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సూచించారు. శుక్రవారం సాయంత్రం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుండి జిలా కలెక్టర్లు, జిల్లా విద్యా శాఖ అధికారులతో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, మన ఊరు మన బడి పై వీడియో కన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం పదోన్నతులు, బడిలీలు పూర్తి అయ్యేవిధంగా చూడాలన్నారు. జిల్లాలో స్పెషల్ మెడికల్ బోర్డు పెట్టుకొని 30వ తేదీ లోగా మెడికల్ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల పై ఇప్పటికే కసరత్తు పూర్తి చేయడం జరిగిందన్నారు. గజిటెడ్ హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ ల సీనియారిటీ జాబితా తయారు చేసి పబ్లిష్ చేయడం జరిగిందన్నారు. మెడికల్ సర్టిఫికెట్ల పరిశీలనకై ప్రత్యేక మెడికల్ బోర్డు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
మన ఊరు మనబడి విషయంలో మండలానికి రెండు చొప్పున 24 పాఠశాలలను మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దడం జరుగుతుందని వాటిలో 12 పాఠశాలలు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయని, మిగిలిన 12 లో ఉపాధి హామీ కి సంబంధించిన పనులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. గ్రీన్ చాక్ బోర్డు లు వచ్చాయని, కానీ డ్యూయల్ డెస్క్ లు ఇంకా రాలేవని తెలియజేసారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి వాకాటి కరుణ, టి.ఎస్.ఈ.డబ్ల్యూ.ఐ.డి.సి చైర్మన్ శ్రీధర్ రెడ్డి, జిల్లా విద్యాధికారి లియఖత్ అలీ, ఏ.ఎస్.ఓ విద్యా సాగర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.