ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా, అవినీతికి తావు ఇవ్వకుండా చేపట్టాలి : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రా రెడ్డి

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా, అవినీతికి తావు ఇవ్వకుండా చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు.
శుక్రవారం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, మన ఊరు మన బడి లో చేపడుతున్న పనుల పురోగతిపై మంత్రి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, డైరెక్టర్ దేవసేన, విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో వెంటనే టీచర్ల సీనియార్టీ జాబితా, ఖాళీల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. అదే విధంగా ప్రతి జిల్లాలో తాత్కాలిక మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలతో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని మంత్రి అన్నారు. ప్రభుత్వ మార్గదర్శలకు అనుకూలంగా పకడ్బందీగా పదోన్నతులు, బదిలీల ప్రక్రియను అమలు చేయాలని మంత్రి సూచించారు.
మన ఊరు మనబడి క్రింద అన్నిరకాల పనులు పూర్తిచేసి తర్వాత మాత్రమే ప్రారంభోత్సవాలు నిర్వహించాలని మంత్రి తెలిపారు. మన ఊరు మనబడి కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయడంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించారని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా కలెక్టర్లు తమ జిల్లా పరిధిలో సోలార్ ప్యానల్ ఏర్పాటు పనులను పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ.. జిల్లాలో ఎంపిక చేసిన 38 పాఠశాలలో ఇప్పటికీ 21 పాఠశాలల్లో పూర్తి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. 17 పాఠశాలలో జాతీయ ఉపాధి హామీ కింద చేయాల్సిన పనులు పెండింగ్ లో ఉన్నాయని వీటిని ఫిబ్రవరి 10 లోపు పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం 15 పాఠశాలలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని ఆమె తెలిపారు. జిల్లా పరిషత్ ఆవరణలో ఉన్న శివ రెడ్డి పేట పాఠశాలలో 30 లక్షలకు పైబడి చేపట్టాల్సిన పనులకు ప్రభుత్వ అనుమతులు వచ్చాయని, వాటిని 45 రోజులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి పాల్గొన్నారు.

Share This Post