ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజల సమస్యలకు ఉచిత న్యాయ సలహాలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతున్న జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని.

ప్రజల వద్దకే న్యాయ సహాయం

జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.జి. ప్రియదర్శిని

ఆజాదీక అమృత్ మహోత్సవాలు

ఉమ్మడి జిల్లాలో 1,279 గ్రామాలు

44 రోజుల పాటు న్యాయ సేవలు

00000

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలకు ఉచిత న్యాయ సలహాలు, సేవలు అందిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి ఎం.జి. ప్రియదర్శిని తెలిపారు. ఆజాదీక అమృత్ మహొత్సవాల్లో భాగంగా సుప్రీం కోర్టు సూచన మేరకు శనివారం జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ముందుగా గాంధీజీ జయంతిని పురస్కరించుకొని మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీజి శాంతి, అహింసకు మారు పేరని గాంధీజీ జీవితం అందరికి ఆదర్శప్రాయమని అన్నారు. గాంధీ జయంతి నుంచి వచ్చే నెల నవంబర్ 14 వరకు సుమారు 44 రోజుల పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 1279 గ్రామాల్లో ఉచిత న్యాయ సలహాలు, సేవలందిస్తామని తెలిపారు. ఇందుకు గాను ఏర్పాటు చేసిన బృందాల సభ్యులు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను గుర్తించి సేవలందిస్తాయని అన్నారు. బృందాలలో న్యాయమూర్తి, ప్యానల్ న్యాయవాది, పారా లీగల్ వాలంటీర్, న్యాయ విద్యార్థులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. ఈ బృందాలు గ్రామాలలో పర్యటించి ప్రజలకు ఉన్న సమస్యలు తగాదాలు, పంచాయితీ, తదితర వాటిని పరిష్కరిస్తారని తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ బృందాలు మారుమూల గ్రామాలను సందర్శించి ఉచితంగా న్యాయ సలహాలు, సేవలను అందిస్తాయని అన్నారు. గ్రామాలలోని నిరక్ష్యరాసులైన ప్రజలను చైతన్యవంతం చేసి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా, లోక్ అదాలత్ ల ద్వారా ఎలాంటి ఫలాపేక్ష లేకుండా సమస్యలు, కేసుల పరిష్కారానికి బృందాలు సేవలందిస్తాయని తెలిపారు. గ్రామాలలో ప్రజల వద్దకే న్యాయ సహాయం పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సేవలను అన్ని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి కోరారు.

ఈ కార్యక్రమంలో ఫస్ట్ అడిషనల్ జిల్లా జడ్జ్ భవాని చంద్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సుజయ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘునందన్ రావు, న్యాయ సేవలందించే బృందాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post