ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీసు కమీషనర్ విష్ణు యస్. వారియర్ తో కలిసి గురువారం సాయంత్రం పరిశీలించారు.

ప్రచురణార్ధం

నవంబరు 25, ఖమ్మం:

ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీసు కమీషనర్ విష్ణు యస్. వారియర్ తో కలిసి గురువారం సాయంత్రం పరిశీలించారు. డిశంబరు 10 వ తేదీన జరుగనున్న శాసనమండలి ఎన్నికల పోలింగ్ లో ఖమ్మం డివిజన్ కు సంబంధించిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను నగరంలోని ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాన్ని వారు సందర్శించి ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీసు అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు చేసారు. ఓటర్ల కొరకు షామియానాలు, త్రాగునీటి సౌకర్యం, కోవిడ్-19 నిబంధనలను పాటించేందుకు అవసరమైన ఏర్పాట్లను పోలింగ్ కేంద్ర ఆవరణలో ఏర్పాటు చేయాలని, సంబంధిత అధికారులను ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి పోలింగ్ కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని, తదనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను వారు ఆదేశించారు. పోలింగ్ కేంద్రం, ఆవరణలో సి సి కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలింగ్ సిబ్బంది, ఏజెంట్ల కొరకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాధ్, ఏ.సి.పి ప్రసన్న కుమార్, పోలీసు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post