ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను సుసంపన్న జిల్లాగా చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు,సాంస్కృతిక,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

పత్రికా ప్రకటన                                                         మహబూబ్ నగర్
20.7. 2021
___________
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను సుసంపన్న జిల్లాగా చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు,సాంస్కృతిక,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మంగళవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా, దేవరకద్ర నియోజకవర్గం,దేవరకద్ర మండలంలోని చిన్న రాజమూరు వాగు పై 4 కోట్ల 97 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో నిర్మించిన చెక్ డ్యామును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ చూసినా నీటితో, పంటలతో పచ్చగా కళకళలాడుతున్నదని ,భవిష్యత్తులో మహబూబ్ నగర్ జిల్లా కోనసీమను తలపిస్తుందని అన్నారు. ఎన్ని శక్తులు అడ్డొచ్చిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి తీరుతామని, ఈ ప్రాజెక్టు ద్వారా కరివేన,ఉదండాపూర్ రిజర్వాయర్లు పూర్తయినట్లయితే అన్ని గ్రామాలలోని చెరువులకు నీరు వస్తుందని అన్నారు. గతంలో పాలకులు చెక్ డ్యాముల నిర్మాణంపై దృష్టి సారించ లేదని, చెక్ డ్యాముల నిర్మాణం వల్ల వందల ఎకరాలకు నీరు అంది 2 పంటలు పండుతాయన్నారు .
తెలంగాణ రాక పూర్వం రైతులు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని, ఇప్పుడు రైతు కళ్లల్లో ఆనందం ఉందని అన్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా పంటలు కనపడుతున్నాయని, దారిపొడవునా పచ్చని పొలాలతో మార్కెట్లనిండా ధాన్యం రాసులతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు.ఇప్పుడు రైతులు బతకడానికి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.

దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో అతి తక్కువ సమయంలో చెక్ డ్యాముల ను నిర్మించడం ద్వారా ఇక్కడి రైతులు రెండు పంటలు పండించేలా ముఖ్యమంత్రి మంజూరు చేశారని అందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు వర్షం ద్వారా కురిసిన ప్రతి నీటి బొట్టు ను రైతులు పంటలు పండించుకునేందుకు ఉపయోగించడమే తమ ధ్యేయమని అన్నారు .
నారాయణపేట శాసనసభ్యులు రాజేందర్రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎండిపోయిన వాగు ప్రస్తుతం సజీవంగా ఉందని ,రామన్ పాడు నుండి కోయిల్ సాగర్ వరకు వాగుపై అవసరమైనన్ని చెక్డ్యాంలు నిర్మించి రైతులకు రెండు పంటలు పండించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది అని అన్నారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రేడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
_________
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ,మహబూబ్ నగర్

 

 

Share This Post