స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ జారీ అయినందున, ఈనెల 16న నోటిఫికేషన్ విడుదలవుతుందని, ఎమ్మెల్సీ ఎన్నికల కు సైతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తనా నియమావళి) వర్తిస్తుందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.
గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎమ్మెల్సీ ఎన్నికల పై అవగాహనా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక ఎమ్మెల్సీ సీటు ఖాళీ అవుతున్నందున ఎన్నికలు నిర్వహించనున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎక్స్ అఫిషియో సభ్యులు మాత్రమే ఓటు హక్కు కలిగి ఉంటారని తెలిపారు.నల్గొండ ఉమ్మడి జిల్లా లో 7 ఖాళీ లు పోగా మొత్తం 1271 మంది ఓటర్లు ఉన్నారని,డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా నవంబర్ 15 న ప్రచురిస్తామని అన్నారు. డివిజన్ల వారీగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సమ్మతి తెలిపారు. ఈనెల 16న నోటిఫికేషన్ విడుదలవుతుందని, ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని తెలిపారు. ఈ నెల 24న స్కూటీని, 26 వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అని తెలిపారు. వచ్చే నెల డిసెంబర్ 10వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారని, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. డిసెంబర్ 14 న ఓ ట్ల లెక్కింపు జరుగుతుందని అన్నారు. డిసెంబర్ 16వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ముగుస్తుందని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే ఎన్నికల మాదిరిగానే ఎం ఎల్ సి ఎన్నికలకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ర్యాలీలు, బైక్ ర్యాలీలు నిషేధ మని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి నిర్వహించే సభలకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని తెలిపారు.ఎన్నికలలో ఎన్నికల కమిషన్ జారీ చేసిన కోవిడ్ నిబంధనలు పాటించాలని,రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అభ్యర్థికి, పార్టీ కార్యకర్తలకు అవగాహన కలిగించాలని అన్నారు.ఎన్నికల విధుల లో ఉన్న అధికారులు,అనధికారులు,అభ్యర్థులు ,పోలింగ్/కౌంటింగ్ ఏజెంట్,ఎన్నికల ఏజెంట్ లు కోవిడ్ రెండు టీకాలు వేసుకొని ఉండాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్ నుంచి జి.మోహన్ రెడ్డి, సిపిఐ నుంచి ఎల్.శ్రావణ్ కుమార్, టిఆర్ఎస్ నుంచి బక్క పిచ్చయ్య, బి ఎస్ పి నుంచి ఏ.శ్రీనివాస్,సి.పి.ఐ.(ఎం)నుండి నర్సి రెడ్డి, ఎం.ఐ. ఎం.నుంచి ఖాజా గౌస్ మోహియుద్దీన్ హషం’ తదితరులు పాల్గొన్నారు.
