గురువారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమైనారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వివరాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని వివరించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసిందని, నవంబర్ 15 లోపు ఓటరు జాబితా డ్రాఫ్ట్ పబ్లికేషన్ విడుదలవుతుందని, నవంబర్ 16 న నోటిఫికేషన్ విడుదల అవుతుందని తెలిపారు. నవంబర్ 16 నుండి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న నామినేషన్ల పరిశీలన, 26 లోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుందని, డిసెంబర్ 10 న పోలింగ్, డిసెంబర్ 14 న కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నల్గోండ జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా, భువనగిరి జిల్లా రెవెన్యూ అధికారి కలెక్టర్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లుగా 177 మంది ఎంపిటిసిలు, 17 మంది జడ్పీటిసిలు, 104 మంది మున్సిపల్ కౌన్సిల్ వార్డు మెంబర్లు, 5 గురు ఎక్స్ అఫిషియో సభ్యులు కలిపి మొత్తము 303 మంది ఓటర్లు పాల్గొంటారని, వీరిలో భువనగిరి డివిజన్ కు 197 మంది, చౌటుప్పల్ డివిజన్‌కు 106 మంది చెందినవారని తెలిపారు. 2 పోలింగ్ కేంద్రాలుగా భువనగిరి డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు
కోవిద్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని తెలిపారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారం నిర్వహించాలని, అంతర్గత సమావేశాలకు 200 మంది, బహిరంగ ప్రదేశాలకు 500 కంటే అధికంగా హజరుకావద్దని, ఇంటింటి క్యాంపేన్ 5 మంది, 72 గంటల ముందుగానే ప్రచారం నిలిపివేయాలని, ప్రచార కార్యక్రమాలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని తెలిపారు.
సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి కిరణ్, సిపిఐ పార్టీ నుండి వై.అశోక్, బి ఎస్ పి పార్టీ నుండి బి.రామచంద్రయ్య, భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ అధికారులు భూపాల్ రెడ్డి, సురేష్ కుమార్, భువనగిరి ఎమ్మార్వో అశోక్ రెడ్డి, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

