ఎగుమతులు చేసే ఉత్పత్తులను గుర్తించాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 24: జిల్లాలో ఎగుమతులు చేసే ఉత్పత్తులను గుర్తించి, ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20 నుండి 26 వరకు వాణిజ్య సప్తాహ్ పేరిట జిల్లాలో ఎగుమతులకు అవకాశాలపై శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని వ్యాపారస్తులు, తాము తయారుచేస్తున్న ఉత్పత్తులు ఆంతర్జాతీయ మార్కెట్ కు ఎగుమతులకు అనుగుణంగా తయారుచేయాలని అన్నారు. ఇక్కడ ఉత్పత్తయ్యే ఉత్పత్తులు ఇక్కడే కాకుండా ఎగుమతి చేసే స్థాయిలో ఉంటే మంచి లాభాలుంటాయన్నారు. జిల్లాలో ఏమేమి వనరులు ఉన్నాయి, ఎలాంటి వస్తువులకు మార్కెట్లో డిమాండ్ ఉంది, క్రొత్తగా వ్యాపారంలో చేరే వారు ఎలాంటి అనుమతులు తీసుకోవాలి, నిబంధనలపై అవగాహన ఉండాలన్నారు. జిల్లాలో 9 వేల ఎకరాల్లో మామిడి, 2 వేల ఎకరాల్లో మిర్చి పంట వేస్తున్నట్లు ఎగుమతికి అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎగుమతికి పంటలను సేంద్రియ పద్ధతుల్లో పండించాలని, క్రిమిసంహారక మందులు, ఎరువులు వాడితే, ఎగుమతికి అనుమతి ఉండదని అన్నారు. మందులు వాడకుండా పండిస్తే, దిగుమతి తగ్గినా ధర మార్కెట్లో పదింతలు వస్తుందని ఆయన అన్నారు. రైతులను ఈ దిశగా ప్రోత్సాహిస్తూ, అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ప్రత్యేకమైన గ్రానైట్ లభ్యమవుతుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అవకాశాలు ఉన్న అవగాహన లేమితో వెనుకబడుతున్నామన్నారు. ఎంఎస్ఎంఇ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించాలని, అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. ఉత్పత్తులకు ప్రోత్సాహం, శిక్షణ, సహకారానికి చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎడి ఎంఎస్ఎంఇ కెవి. రావు, జిఎం ఇండస్ట్రీస్ రమేష్, ఎల్డిఎం టివి. శ్రీనివాసరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పోకల లింగయ్య, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు పి. వెంకటనారాయణ, పెంబర్తి హస్తకళాకారుల సంఘం అధ్యక్షులు ఏ. సోమనర్సింహ చారి, జిల్లా అధికారులు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post