ఎటువంటి లైఫ్ లాస్ జరగకుండా పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రానున్న 48 గంటల్లో జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అత్యవసరంగా ఆదివారం సాయంత్రం రెవిన్యూ, మండల ప్రత్యేక అధికారులు, ఇరిగేషన్, పంచాయతీరాజ్, రహదారులు భవనాలు శాఖ, విద్యుత్, అగ్నిమాపక, మున్సిపల్ కమిషనర్లు, డిపిఓ, యంపిడిఓ, యంపిఓలతో అధిక వర్షాలు వల్ల ప్రజలు, పశువులు, చెరువులు సంరక్షణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సన్నద్ధం చేయుటలో భాగంగా టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అధికారులు కార్యస్థానాల్లో ఉండాలని ఎటువంటి సెలవులు అనుమతించబడవని చెప్పారు. పొంగుతున్న వాగుల్లో పడి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరుగుతున్నదని, వాగులు. పొంగే సమయాల్లోను, వర్షం కురిసే సమయాల్లోను ప్రజలు ఇంటి నుండి బయటి రాకుండా ఉండటంతో పాటు ప్రయాణాలను కూడా మానుకోవాలని చెప్పారు. గ్రామస్థాయిలో
టాం టాం వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో ప్రజలు ఉండకుండా చర్యలు తీసుకోవాలని చెప్పాడు. ముంపు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వాగులు దాటకుండా రక్షణ చర్యలు చేపట్టటులో భాగంగా పటిష్ట బారికేడింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. గజ ఈతగాళ్లను, నాటు పడవలు, టార్చ్ లైట్లు, లైఫ్ జాకెట్లు, ఎన్టీఆర్ఎఫ్ టీములను సిద్ధంగా ఉంచుకోవాలని తహసిల్దారులను ఆదేశించారు. కలెక్టరేట్ నందు 24 గంటలు పనిచేయు విధంగా 08744-241950 కంట్రోల్ రూముతో పాటు వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చేందుకు 9392919743 ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అత్యవసర సేవలకు ప్రజలు కంట్రోల్ రూముకు ఫోన్ చేయాలని చెప్పారు. నీటి నిల్వలు వల్ల నీరు పొంగి పొర్లే ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టేందుకు జెసిబిలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. నాళాల్లో పేరుకు పోయిన వ్యర్థాలు తొలగించడం వల్ల నీటి నిల్వలు లేకుండా సాఫిగా వెళ్లడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. రాత్రి సమయాల్లో కూడా అధికారులు అందుబాటులో ఉండాలని చెప్పారు. డిఆర్ఓకు ఎప్పటికప్పుడు నివేదికలు అందచేయాలని ఆదేశించారు. ఈ 48 గంటలు అత్యంత అప్రమత్త అవసరమని , ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే ప్రమాదాలను సమర్థ వంతంగా ఎదుర్కోగలమని చెప్పారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని, వాగులు, వంకలు పొంగిపొర్లుతుంటే రైతులు పొలం పనులకు వెళ్ళొద్దని, పశువులను మేతకు వదలొద్దని చెప్పారు. ప్రజలు వాగులు, వంకలు దాటకుండా పటిష్ఠ రక్షణ చర్యల్లో భాగంగా పోలీసులు రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. జలాశయాలు, చెరువులు, వాగులు వంకల వద్ద ప్రజలు సెల్ఫీలు దిగకుండా నిషేదించాలని చెప్పారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపునకు పునరావాస కేంద్రాలను సంసిద్ధం చేయాలని తహసిల్దారులను ఆదేశించారు. రోడ్లు కటాఫ్ అయితే తక్షణ చర్యలు చేపట్టేందుకు జాతీయ, ర.భ, పంచాయతీ ఇంజనీరింగ్ అధికారులు సిద్దంగా ఉండాలని చెప్పారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో పాటు వాహనాలను, లైఫ్ జాకెట్లు వంటి వాటితో రిస్క్ ఆపరేషన్లు నిర్వహణకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఈ టెలికాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్ఓ అశోక్ చక్రవర్తి, జడ్పి సీఈఓ విద్యాలత, విద్యుత్ శాఖ ఎస్ఈ సురేందర్, డిపిఓ రమాకాంత్, ర.భ. ఈ ఈ భీంలా, పంచాయతిరాజ్ ఈఈలు సుధాకర్, మంగ్యా, మున్సిపల్ కమిషనర్లు, అన్ని మండలాల తహసిల్దారులు, యంపిడిఓలు, యంపిఓలు తదితరులు పాల్గొన్నారు.