ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి- జిల్లాఎన్నికల అధికారి హరీష్

ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి- జిల్లాఎన్నికల అధికారి హరీష్

మెదక్ స్థానిక సంస్థల నియోజక వర్గ శాసన మండలి ఎన్నిక ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి హరీష్ పోలింగ్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ లోని ఆడిటోరియం లో జోనల్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతూ కరదీపిక లోని ఎన్నికల నియమావళి మేరకు ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని, ఇందులో ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోరాదని, ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురైతే వెంటనే తమను సంప్రదించాలని అన్నారు. ఈ ఎన్నికలలో చాలా తక్కువ సంఖ్యలో ఓటర్లు ఉంటారని, అందరు అక్షరాస్యులే అయినందున ఒత్తిడులకు గురికాకుండా చాలా సాఫీగా పకడ్బందీగా నిర్వహించవచ్చని అన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,026 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఇందుకోసం మెదక్ జిల్లాలో 3, సంగారెడ్డి జిల్లాలో 4, సిద్ధిపేట జిల్లాలో 2 పోలింగు కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. మొత్తం 9 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల నిర్వహణకు ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక జోనల్ అధికారిని, మైక్రో పరిశీలకులను, నలుగురు పోలింగ్ అధికారుల చొప్పున నియమించడం జరిగిందని అన్నారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని అన్నారు. ఈ శాసన మండలి ఎన్నికలో ఇనెబిల్డ్ ఇంకు (సిరా) వేలుకు పెట్టారని, బ్యాలెట్ పేపర్ కౌంటర్ ఫెయిల్ పై ఓటరు సంతకం తీసుకోవాలని సూచించారు. బ్యాలెట్ పేపర్ పద్ధతిన జరుగు పోలింగుకు ఓటరు తమ ఓటును ప్రాధాన్యత క్రమంలో అంకెల రూపంలో వాయిలేట్ కలర్ పెన్ తోనే వేయవలసి ఉంటుందని, అట్టి బ్యాలెట్ పేపర్ ను వర్టికల్, హారిజెంటల్ రూపంలో మడిచి బాక్సులో వేసేలా చూడాలని పోలింగు అధికారులకు సూచించారు. ఓటింగు రహస్యంగా జరిగే విధంగా పోలింగ్ నిర్వహణకు కంపార్ట్మెంట్ ను చక్కగా ఏర్పాటు చేయాలని, పోలింగు బూతు బయట అభ్యర్థుల జాబితా, ఓటర్ల వివరాలు, పోలింగ్ కేంద్రం సంఖ్య, లోపలికి , వెలుపలికి దారి, అభ్యర్థుల ఏజెంట్లు,తదితర వివరాలు ప్రదర్శించాలని సూచించారు. ఓటరు కేంద్రానికి వచ్చి ఓటు వేసి వెళ్లే వరకు పోలింగు అధికారులు అప్రమత్తంగా ఉంటూ డేగ కళ్ళతో పరిశీలిస్తు ఏ ఒక్క చిన్న పొరపాటు కూడా జరగకుండా చూడాలన్నారు. ఈ నెల 9 న రిసెప్షన్ కౌంటర్ నుండి మెటీరియల్ ను చెక్ లిస్ట్ ప్రకారం అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా సరి చూసుకోవాలని కేంద్రానికి సమకూర్చిన ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లాలని, పోలింగ్ అయిన అనంతరం అదే వాహనంలో నేరుగా రిసెప్షన్ కౌంటర్ లో బ్యాలట్ బాక్సులు, పోలింగ్ అధికారి డైరీ, నివేదికలు, మెటీరియల్ అందజేయాలని ఇందులో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని స్పష్టం చేశారు. తిరిగి ఈ నెల 8 న మరోసారి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు.
అంతకు ముందు స్వీప్ నోడల్ అధికారి రాజి రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బ్యాలెట్ పేపర్ పరిశీలన, మెటీరియల్ స్వీకరణ, పోలింగు కేంద్రాలలో కంపార్టుమెంట్ల ఏర్పాటు , పోలింగ్ కేంద్రాల ముందు ప్రదర్శించవలసిన పేపర్లు, బ్యాలెట్ బాక్స్ ఓపెన్, పేపర్ సీల్ తదితర అంశాలపై పోలింగ్ అధికారులకు అవగాహన కలిగించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, ఎన్నికల సహాయ అధికారి రమేష్, డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, డి.పి .ఓ. తరుణ్ కుమార్, జిల్లా స్వీప్ నోడల్ అధికారి రాజి రెడ్డి, కలెక్టరేట్ ఏ.ఓ. యూనుస్, జోనల్ అధికారులు, పోలింగ్ అధికారులు, ఎలక్షన్ సూపరింటెండెంట్ శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post