ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నుండి నేరుగా నిజామాబాద్ కు చేరుకున్న ఆయన పోలీసుల నుండి గౌరవ వందనం
స్వీకరించారు. అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీసీపీ వినీత్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి గోవింద్, ఆర్డీవో రవి తదితరులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు స్వాగతం పలికి, ఆయనతో సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ కారణాల వల్ల ఆయా గ్రామ పంచాయతీలు,, ఎంపీటీసీ స్థానాలు, మునిసిపాలిటీల పరిధిలో ఖాళీ అయిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు, ఎంపీటీసీ, కౌన్సిలర్ స్థానాల గురించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మొత్తం 10 సర్పంచ్, 14 ఉప సర్పంచ్, 135 వార్డు సభ్యుల స్థానాలు, ఒక ఎంపీటీసీ స్థానం, బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని ఒక కౌన్సిలర్ స్థానాలు ఖాళీగా ఉన్నాయని జిల్లా అధికారులు కమిషనర్ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన మీదట రానున్న జూన్ మాసంలో వీటి భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువరించే అవకాశాలు ఉన్నందున ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సమాయత్తం అయి ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాలను ఈ నెల 24 వ తేదీ వరకు గుర్తించి ఓటింగ్ ప్రక్రియ కోసం సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎక్కడ కూడా ఏ చిన్న తప్పిదానికి సైతం ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. కాగా, ఇప్పటికే ఓటర్ల జాబితాను ఖరారు చేసి, డ్రాఫ్ట్ పబ్లికేషన్ ప్రక్రియను పూర్తి చేశామని, జక్రాన్ పల్లి మండల వైస్ ఎంపీపీ ఎన్నికకు సంబంధించి ఈ నెల 7 వ తేదీన నోటిఫికేషన్ వెలువరించడం జరిగిందని, 23 వ తేదీన ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు కమిషనర్ దృష్టికి తెచ్చారు.
—————————

Share This Post