ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల పోలింగ్ కేంద్రం పోలింగ్ కేంద్రంలో చేస్తున్న ఏర్పాట్లను జిల్లా ఎస్పీ తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్

ప్రచురణార్థం-2
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 08: జిల్లాలో ఈ నెల 10 వ తేదీన నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. బుధవారం కలెక్టర్, జిల్లా ఎస్పీ బి.కె. రాహుల్ హెగ్డే తో కలిసి ఎన్నికల పోలింగ్ కు కేటాయించిన సిరిసిల్ల పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగడానికి అందరూ సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో 201 మంది ఓటర్లు ఉండగా, అందులో 88 పురుష, 113 మహిళా ఓటర్లు వున్నారన్నారు. ఇందులో 66 మంది కౌన్సిలర్లు, 12 మంది జెడ్పిటిసిలు, 121 మంది ఎంపిటిసిలు, ఇద్దరు ఎక్స్ ఆఫీషియో సభ్యులున్నారన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించాలని జిల్లా పరిషత్ కార్యనిర్వహణ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఓటర్లు కోవిడ్ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సజావుగా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయడానికి తగిన చర్యలు జిల్లా యంత్రాంగం తరపున తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, స్టాటిస్టికల్ సర్వే లైన్స్ టీమ్స్, వీడియో సర్వలేన్స్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమైన ప్రదేశాల్లో పికెట్స్ నాలుగు రూట్లలో పెట్రోలింగ్ టీమ్స్ , స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. పోలింగ్ కేంద్రంలోనికి నిషేధిత వస్తువులు అనుమతించబడదని తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు ఫోన్ చేయాలని ఎస్పీ తెలిపారు.
ఈ సందర్శనలో జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, ఇంచార్జి జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు, డీఎస్పీ చంద్రశేఖర్, తహశీల్దార్ విజయ్ కుమార్, మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య, టౌన్ సీఐ అనిల్ కుమార్, రూరల్ సీఐ ఉపేందర్, స్పెషల్ బ్రాంచ్ సీఐ సర్వర్, తదితరులు వున్నారు.

Share This Post