పత్రికా ప్రకటన
సిద్దిపేట 9 నవంబర్ 2022.
ఎల్ అండ్ టి వారి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువత నైపుణ్య శిక్షణ పొందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ కేసీఆర్ నగర్లో (2 బిహెచ్ కే కాలనీ) ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఎల్ అండ్ టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిషన్, ప్లంబింగ్, కార్పెంటర్, బార్ బెండింగ్, సెంట్రింగ్ అంశాలలో 3 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు ఉచిత భోజన వసతి కల్పించడం జరుగుతుందని ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన క్లాస్ రూమ్స్, ప్రాక్టికల్స్ మిషన్లను సిద్ధం చేయడం జరిగిందని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి గోపాల్ రావు మరియు ఎల్ & టి ట్రైనింగ్ ప్రతినిధులు బాలమురళి మరియు నవీన్ కలెక్టర్ కు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వృత్తి నైపుణ్యం లేని నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్యం పెంచుకొని మార్కెట్లో డిమాండ్ గల ఎలక్ట్రిషన్, ప్లంబింగ్, కార్పెంటర్, సెంట్రింగ్ మరియు బార్ బెండింగ్ వృత్తులలోకి వెళ్లేందుకు ఎల్ & టి స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చాలా ముఖ్యమైనదని ఈ శిక్షణ ప్రోగ్రాం ద్వారా జిల్లాలోని వృత్తి నైపుణ్యం లేని నిరుద్యోగ యువత వృత్తి నైపుణ్యత శిక్షణ పొంది జీవితంలో స్థిరపడేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. వృత్తి నైపుణ్యం లేని నిరుద్యోగ యువత కొరకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రత్యేక శ్రద్ధతో ఈ వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, డిఆర్డిఏ ద్వారా మండలాల్లో, మెప్మా ద్వారా పట్టణాలలో నిరుద్యోగ యువతను గుర్తించి శిక్షణ పొందేలా చూడాలని అన్నారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న 49 మంది నిరుద్యోగులకు రేపటి నుంచి ఎలక్ట్రిషన్ మరియు ప్లంబింగ్ లలో శిక్షణ ఇవ్వాలని ఎల్ & టి సిబ్బందిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు హరీష్ రావు ఓఎస్డి బాలరాజు, స్థానిక వార్డు కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు.
issued by District Public Relations Office Siddipet