ఎస్సీ ఉపకార వేతనాల దరఖాస్తులు పరిశీలించండి – జిల్లా కలెక్టర్ హరీష్

ఎస్సీ ఉపకార వేతనాల దరఖాస్తులు పరిశీలించండి  – జిల్లా కలెక్టర్ హరీష్

5 నుండి 10 వ తరగతి చదువుచున్న ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్, ఇంటర్మీడియట్ నుండి ఆ పై చదువుచున్న విద్యార్థులకు పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలు పొందుటకు అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ జారీలో ఉప తహసీల్ధార్లు ప్రత్యేక చొరవ తీసుకోని వెంటనే దరఖాస్తులను పరిశీలించి జారీ చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ ఆదేశించారు. మంగళవారం షెడ్యూల్డ్ కులాల విద్యార్థిని, విద్యార్థులకు చెందిన ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాల దరఖాస్తుల పూరింపు ,పరిశీలన, మంజూరుపై సంబంధిత అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల మంజూరికి అర్హులైన విద్యార్థుల దరఖాస్తులను నింపి అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జతచేసి పంపుటకు సంబంధిత ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తగు ఆదేశాలివ్వవలసినదిగా మండల వైద్యాధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ పై చదువుచున్న విద్యార్థుల దరఖాస్తులను పంపుటకు ఆయా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు, ప్రభుత్వ కళాశాలల ప్రధానాచార్యులకు తగు సూచనలు ఇవ్వవలసినదిగా జిల్లా ఇంటర్మీడియట్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ జారీలో ప్రత్యేక చొరవ చూపవలసినదిగా ఉప తహసీల్ధార్లకు సూచించారు. ప్రాధాన్యత క్రమంలో మొదట రెన్యువల్ విద్యార్థుల దరఖాస్తులను 10 రోజులలోగా, ఆ తరువాత ప్రెష్ విద్యార్థుల దరఖాస్తులను ఈ నెల 30 లోగా పూర్తి చేసి జిల్లా ఎస్సి అభివృద్ధి అధికారి కార్యాలయంలో అందజేయవలసినదిగా మండల విద్యాధికారులను , ఇంటర్మీడియట్ నోడల్ అధికారిని, ఎస్సి వసతి గృహ సంక్షేమాధికారుల ను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులు ఉపకార వేతనాలకై దరఖాస్తు చేయుటకు ఎలాంటి ఇబ్బందలు లేకుండా చూడాలని అన్నారు.

ఈ టెలీకాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రమేష్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, జిల్లా విద్యా శాఖాధికారి రమేష్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సత్యనారాయణ, అన్ని మండలాల ఉప తహసీల్ధార్లు, విద్యాధికారులు, వసతి గృహ సంక్షేమాధికారులు పాల్గొన్నారు.

Share This Post