ఎస్సీ /ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడటంతోపాటు చట్టప్రకారం వారికి రావలసిన బెనిఫిట్స్ వీలైనంత తొందరగా ఇప్పించాలని, మరోవైపు నిందితులకు సరైన శిక్ష పడే విధంగా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉన్నదని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు.
బుధవారం నాడు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి ఎస్సీ/ ఎస్టీ అట్రాసిటీ కేసులపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కేసులకు సంబంధించి అత్యంత పేదలకు చట్టప్రకారం తప్పకుండా 100% న్యాయం జరిగేలా చూడడంతో పాటు వారికి రావలసిన పరిహారాలు వీలైనంత త్వరగా ఇప్పించడం ద్వారా వారు కొంతవరకైనా నిలదొక్కుకోవడానికి వీలవుతుందని ప్రతి సోమవారం ప్రజావాణి ద్వారా పలు సమస్యలపై తమకు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని, వారిపై దాడుల ఈ విషయంలో ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తదుపరి చర్యలు తీసుకోవాలని డివిజన్ స్థాయి ఏసీపీలను కోరారు. సరైన విచారణ ద్వారా అర్థవంతమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని తద్వారా మంచి ఫలితాలు కూడా వస్తాయని సూచించారు. ఈ విషయంలో పోలీస్ అధికారుల పాత్ర అత్యంత ముఖ్యమైనదని ఫిర్యాదులు రాగానే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి అందిన ఫిర్యాదుల కనుగుణంగా లోతుగా విచారణ జరిపి నిర్ణయాలు తీసుకోవాలని తమ దృష్టికి వచ్చిన ప్రతి కేసు గురించి క్షుణ్ణంగా పరిశీలన చేయాలని విచారణ చేపట్టాలని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరారు. తాను మహబూబ్నగర్ జిల్లాలో పని చేసిన కాలంలో కేసులు వందల్లో ఉండేవని ఇక్కడ మాత్రం కేవలం 23 కేసులు మాత్రమే పెండింగులో ఉన్నాయని దీనిని బట్టి అధికారులు బాగానే పని చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చన్నారు. ఏ మాత్రం ఆధారాలు లభించినా అధికారులు ముందుకు వెళ్లి మరింత విచారణ జరిపి దోషులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని, కోవిడ్ కారణంగా గత సంవత్సరం పైగా కోర్టులు నడువనందున కేసుల్లో కొంత వెనుకబాటు ఉంటే ప్రస్తుతం కోర్టు లు పనిచేస్తున్నందున అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చి కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తదుపరి మీటింగు కాళ్ల పెండింగ్ ట్రాయెల్స్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. తప్పకుండా చార్జిషీట్ చేసి విచారణ జరిగేలా ప్రతి ఒక్కరం కృషి చేద్దామని తెలిపారు.
సత్వర విచారణ, పరిహారం – సిపి కార్తికేయ:–
ఎస్సీ /ఎస్టీ అట్రాసిటీస్ కేసులకు సంబంధించి గత మీటింగులో 42 కేసులు ఇన్వెస్టిగేషన్లో పెండింగ్లో ఉండగా ప్రస్తుతం 23 మాత్రమే ఉన్నాయని పోలీసు అధికారులు ఈ విషయంలో విచారణ జరపడంతో పాటు బాధితులకు రావాల్సిన పరిహారాన్ని ఇప్పించడానికి చర్యలు తీసుకోవడం ద్వారా పెండింగ్ కేసులు తగ్గడంతో పాటు త్వరగా పరిహారం కూడా అందుతుందని కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తికేయ వివరించారు. స్టే ఆర్డర్ ఆరు నెలలకు దాటి ఉంటే బాధితులకు సత్వర న్యాయం అందించడానికి పోలీస్ అధికారులు విచారణ చేపట్టవచ్చని కోర్టులు ఆదేశాలు జారీ చేశాయని, తద్వారా బాధితులకు మరింత సత్వర న్యాయం, సహాయం అందించడానికి వీలవుతుందని తెలిపారు. పరిహారం కూడా ఎప్పటికప్పుడు సెటిల్ చేస్తున్నామని పేర్కొన్నారు.
2018 నుండి 2021 వరకు అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు జిల్లాలో 23 పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్ ట్రయల్స్ కింద 184 కేసులు స్పెషల్ ఎస్సీ ఎస్టీ కోర్టులో 267 కేసులు చార్జిషీట్లు దాఖలు కాగా 171 హియరింగ్స్ స్టేజిలో ఉండగా 72 కేసులకు సమన్లు జారీచేశారు. 24 కేసులకు ఎన్ బి డబ్ల్యు సర్వ్ కాలేదు.
పెండింగ్ ట్రయల్ కేసుల్లో మొదటి విడతగా 161 కేసులకు 1.83 కోట్ల రూపాయలు రిలీఫ్ అందజేయగా రెండో విడతలో 137 కేసులకు 1.42 కోట్ల రూపాయలు రిలీఫ్ అందించారు. అండర్ ఇన్వెస్టిగేషన్ లో 23 కేసులో గారు పది కేసులకు 8.37 లక్షల రూపాయలు పరిహారం అందించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చిత్ర మిశ్రా, చంద్రశేఖర్, జిల్లా ఎస్ సి అభివృద్ధి అధికారి శశికళ, అదనపు సీపీ అరవింద్ బాబు, మూడు డివిజన్ల ఏ సి పి లు రామారావు, రఘు, వెంకటేశ్వర్లు, ఆర్ డి వో లు రాజేశ్వర్, శ్రీనివాస్, రవి, డి పి ఓ జయసుధ, జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం బాబురావు, ఇడీ బీసీ కార్పొరేషన్ రమేష్, కమిటీకి నియమించబడిన అధికారిక, అనధికారిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.