ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లబ్ధిదారులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న రుణాలను ఏప్రిల్ 20 వరకు వెంటనే మంజూరు చేయాలి : జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లబ్ధిదారులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న రుణాలను ఏప్రిల్ 20 వరకు వెంటనే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి బ్యాంకులను ఆదేశించారు.

గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు లో బ్యాంకర్లు, అధికారులతో డిసిసి, డి ఎల్ ఆర్ సి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన పెండింగ్ రుణాలను వెంటనే మంజూరు చేయాలని అన్నారు. ఇన్ని రోజులుగా మంజూరు చేయకపోవడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి సబ్సిడీ నిధులు విడుదల అయినప్పటికీని ఇప్పటివరకు గ్రౌండ్ చేయకపోవడంపై ఎస్బిఐ బ్యాంక్ అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా
చన్గొముల్, కంకల్, బొమ్మిరాస్పేట్, వికారాబాద్ బ్రాంచీలలో ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నప్పుడు బ్యాంకర్లు ఇన్ని రోజులు పెండింగ్లో ఉంచడం ఎంత వరకు సమంజసం అని తీవ్రంగా మందలించారు. ఏప్రిల్ మాసం 20 నాటికి పెండింగ్ లో ఉన్న రుణాలను గ్రౌండ్ చేయాలని ఆదేశించారు.

జిల్లాలో పంట రుణాల క్రింద డిసెంబర్ మాసంతం వరకు రూ.2433.53 కోట్ల లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ. 1192.54 కోట్ల రుణాలు అందజేసి 49 శాతం లక్ష్యం సాధించడం జరిగిందన్నారు. ఇట్టి లక్ష్యాన్ని మార్చ్ మాసంతం వరకు ఎట్టి పరిస్థితుల్లోనైనా 80 శాతం లక్ష్యం పూర్తి చేయాలని బ్యాంకులకు కలెక్టర్ ఆదేశించారు. రైతులు ఎక్కువ రుణాలు పొందేలా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ కాల పరిమితి రుణాల క్రింద రూ.1053.35 లక్ష్యం కాగా, రూ.428.78 కోట్ల రుణాలు అందజేసి 41 శాతం లక్ష్యం సాధించినట్లు, అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు రూ.1015.74 కోట్ల రూపాయల లక్ష్యం కాగా, రూ. 121.55 కోట్ల రుణాలు అందజేసి 12 శాతం లక్ష్యం సాధించినట్లు తెలిపారు. ప్రాధాన్యత రంగాలకు లక్ష్యం రూ.5692.31 కోట్లు కాగా, రూ. 1900.74 రుణాలు అందజేసి 33.39 శాతం అలాగే ప్రాధాన్యేతర రంగాలకు రూ. 1001.59 లక్ష్యం కాగా, రూ. 513.80 కోట్ల రుణాలు అందజేసి 51.30 శాతం లక్ష్యం సాధించడం జరిగిందని తెలియజేశారు. జిల్లాలో అన్ని రంగాలకు కలిపి మొత్తం రూ.6693.90 కోట్ల రూపాయల లక్ష్యం కాగా, ఇప్పటివరకు 2414.54 కోట్ల రూపాయల రుణాలు అందజేసి 36 శాతం లక్ష్యం సాధించడం జరిగిందన్నారు. వ్యవసాయ రంగంలో అభివృద్ధి కొరకు ఎల్ డి ఎం, వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు సమావేశాలు నిర్వహించి రైతులు అధిక సంఖ్యలో రుణాలు పొందేలా అవగాహన కల్పించాలన్నారు. రైతులకు పంట రుణాలు విరివిగా అందించేందుకు బ్యాంకర్లు సంబంధిత అధికారులందరూ టీం వర్క్ గా పనిచేసి ఈ యాసంగిలో 80 శాతం రుణాలు అందించే అందించగా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే స్టార్టప్ ఇండియా పథకం క్రింద ఎల్ డి ఎం, జిఎం ఇండస్ట్రీస్, గిరిజన సంక్షేమ శాఖ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అధికారులు కలిసి జిల్లాలో ఈ మాసాంతం వరకు కనీసం100 దరఖాస్తులను స్వీకరించాలన్నారు. తిరిగి ఏప్రిల్ మాసంలో ఇట్టి అంశాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించి సమీక్షిస్తానని కలెక్టర్ తెలియజేశారు.

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార సంస్థల ఆధునీకరణ పథకం ( PMFME) క్రింద ఇప్పటివరకు జిల్లాలో 58 యూనిట్లకు మంజూరు చేయడం జరిగిందని, ఇందులో17 యూనిట్లను ఇప్పటికే గ్రౌండ్ చేసినట్లు కలెక్టర్ తెలియజేశారు. ఇందులో ఒక రైస్ మిల్, రెండు బేకరీలు, రెండు ఆయిల్ మిల్లులు, ఒకటి మినీ దాల్ మిల్, స్వగృహ ఫుడ్స్, ఒకటి పిండి గిర్ని, కారం గిర్ని, పసుపు గిన్నెలను గ్రౌండ్ చేయడం జరిగిందన్నారు. మరో 120 యూనిట్లో బ్యాంకర్ల వద్ద ప్రాసెస్ లో ఉన్నాయని, ఇట్టి వాటిని బ్యాంకర్లు వారం రోజులలో గ్రౌండ్ చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరుపై కలెక్టర్ సమీక్షించారు. వీటి పనితీరును మెరుగుపరుస్తూ రైతులకు లాభం చేకూరేలా కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. కూరగాయలు మరియు పండ్ల ప్రాసెసింగ్ కొరకు ఏర్పాట్లు చేయాలని దీని ద్వారా రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు.

ఈ సమావేశంలో ఎల్ డి ఎం రాంబాబు, ఆర్బిఐ ఏజీఎం హనుమ కుమారి, నాబార్డ్ డీడీఎం ప్రవీణ్ కుమార్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ యూసఫ్ అలీ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి వినయ్ కుమార్, హార్టికల్చర్ అధికారి చక్రపాణి, ఈ డి ఎస్ సి కార్పొరేషన్ బాబు మోజెస్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సుధారాణి, డి ఆర్ డి ఏ పి డి నర్సింలు, డిపిఎం శ్రీనివాస్, వ్యవసాయ శాఖ సహాయ అధికారి తదితరులు పాల్గొన్నారు.

Share This Post