ఏ.ఎన్.సి. పరీక్షలు క్రమం తప్పకుండ నిర్వహించాలి-జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సెప్టెంబర్ 14, 2021ఆదిలాబాదు:-

గర్భిణీలకు క్రమం తప్పకుండ ప్రతి నెల పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున భీంపూర్ మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలకు సంబంధించిన సూచికలు, పోస్టర్ లను పరిశీలించారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు సంబంధించిన పథకాలు, గర్భిణీలు, బాలింతలు, పిల్లకు సంబంధించిన ఆరోగ్య కార్యక్రమ వివరాలు తెలుగులో ఏర్పాటు చేయాలనీ ఇంచార్జి మెడికల్ ఆఫీసర్ ను కలెక్టర్ ఆదేశించారు. స్థానిక భాషలో అర్ధమయ్యే విధంగా ప్రజలకు వివరించడం ద్వారా ప్రభుత్వం ఆశించిన ప్రగతి సాధించవచ్చని అన్నారు. గిరిజన గ్రామాలలో వ్యాక్సినేషన్ తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. రాష్ట్ర సరిహద్దున మహారాష్ట్ర ప్రాంతం ఉన్నందున మన జిల్లా పరిధిలో గల బార్డర్ గ్రామాలలోని ప్రజలకు వ్యాక్సిన్ తప్పని సరిగా వేసుకునే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. గర్భిణీలకు ప్రతి నెల ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ప్రణాళికలతో ఏ నెలలో ఎవరెవరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారో పరిశీలించి పరీక్షలు హాజరు కానీ వారిని తెలుసుకొని వారు ఏ ప్రాంతంలో ఉన్నది స్థానిక సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దల ద్వారా తెలుసుకొని ఆ ప్రాంతంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ కు తెలియజేసి వైద్య పరీక్షలు నిర్వహించే విధంగా సమన్వయము చేసుకోవాలని అన్నారు. అనంతరం ప్రసవం జరిగిన బాలింతలకు కెసిఆర్ కిట్ ను అందజేశారు. ఆ తరువాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, ఇంచార్జ్ మెడికల్ ఆఫీసర్, ఇమ్యునైజేషన్ అధికారి డా.విజయసారధి, మాత శిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారిని డా.నవ్య సుధా, జడ్పీ సీఈఓ గణపతి, సర్పంచ్ లింబాజి, ఉపసర్పంచ్ కైలాష్, తహసీల్దార్ సోము, ఎంపీడీఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post