ప్రచురణార్థం
ఐఎస్ఐ మార్కు ఉన్న వస్తువులనే ఉపయోగించాలి ….
బీఐఎస్ కేర్ యాప్ ద్వారా కొనేముందే నాణ్యత పరిశీలించాలి … జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్
మహబూబాబాద్, మే -30:
ISI మార్క్ ఉన్న వస్తువులను ఉపయోగించాలని, అలాగే BIS కేర్ యాప్ ద్వారా కొనే ముందు నాణ్యత పరిశీలించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.
సోమవారం కలెక్టరేట్ ప్రగతి సమావేశ మందిరంలో జిల్లా లీగల్ మెట్రాలజీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఉన్నతాధికారులకు బీఐఎస్ శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో పాల్గొన్న అదనపు కలెక్టర్ అభిలాష మాట్లాడుతూ, వస్తువుల నాణ్యత, భారతీయ ప్రమాణాలపై వినియోగదారుల్లో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడంతో పాటు జిల్లా పరిధిలో ఏ వస్తువు కొనాలన్నా ముందు ఐఎస్ఐ ముద్ర తప్పకుండా చూడాలని తెలిపారు.
ఈ సందర్భంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్డ్ (బీఐఎస్) శాస్త్రవేత్త గౌతమ్ అవగాహన కల్పించారు. పెద్ద ఎత్తున టెండర్లు పిలిచే ముందు తప్పనిసరిగా ఐఎస్ఐ మార్క్ ఉన్నవే సరఫరా చేయాలని వర్తకులను కోరాలని తెలిపారు. భారతీయ ప్రమాణాలు జారీ చేసే విధానం, వస్తువుల నాణ్యత పరీక్షించుకునే తీరు, బంగారం హాల్ మార్కింగ్ తదితర విషయాలను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వినియోగదారులు బీఐఎస్ కేర్ యాప్ ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా వస్తువు కొనేముందే అరచేతిలో నాణ్యతను పరీక్షించుకోవచ్చునని తెలిపారు. బీఐఎస్ అధికారిక వెబ్సైట్లో లైసెన్సీల వివరాలు, భారతీయ ప్రమాణాలు ఉన్న వస్తువుల వివరాలు తెలుసుకోవచ్చునన్నారు. తెలంగాణలో ఉమ్మడి జిల్లాల్లో హాల్‌మార్కింగ్ ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిందని, బంగారం కొనేముందు నాణ్యత తెలుసుకునేందుకు బీఐఎస్ కేర్ యాప్‌లో ఆభరణంపై ముద్రించిన హెచ్‌యూఐడీ నెంబర్ ద్వారా నాణ్యత, హాల్ మార్కింగ్ వివరాలు పొందవచ్చని తెలిపారు. మంచినీటి బాటిళ్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఇంటి సామాన్లు తదితర వస్తువుల కొన్న తర్వాత వినియోగదారులు నకిలీ ఐఎస్ఐ మార్కు గుర్తించినా, నాణ్యతలో లోపాలు కనిపించినా బీఐఎస్ కేర్ ద్వారా ఫిర్యాదు చేస్తే బీఐఎస్ తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, శాస్త్రవేత్త విధిష, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు స్టాండర్డ్ ప్రమోటింగ్ అధికారి అభిసాయి, తదితరులు పాల్గొన్నారు.