ఐ.డి. ఓ.సి. కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు : రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

పత్రికా ప్రకటన తేది:15.08.2022, వనపర్తి.

75 వసంతాల స్వాతంత్య్ర భారత దినోత్సవం సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు.
సోమవారం ఐ.డి. ఓ.సి. కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి మంత్రి పతాకావిష్కరణ గావించారు. అనంతరం పోలీసు కవాతు, గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద వీరాంజనేయ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి 4,380 ఎకరాలు భూమిని సేకరించవలసిన లక్ష్యానికి గాను రూ.208 కోట్ల రూపాయలు సంబంధిత రైతులకు నష్టపరిహారంగా చెల్లించడం జరిగిందని ఆయన సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా జిల్లాలో రూ.260 కోట్ల 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పనులు చేపట్టి, రూ.206 కోట్ల రూపాయల వ్యయం చేయటం జరిగిందని ఆయన అన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువుల పెట్టుబడి సహాయం కింద అందించే రైతుబంధు మొత్తాన్ని 2022 వానాకాలంలో 1 లక్ష 64 వేల 171 మంది రైతుల ఖాతాలలో ఎకరాకు రూ.5 వేల చొప్పున రూ.180 కోట్ల 56 లక్షల 13 వేల 830 రూపాయలను జమ చేయడం జరిగిందని ఆయన వివరించారు. వనపర్తి మున్సిపాలిటీలో వ్యవసాయ మార్కెట్ కమిటీ రూ.66 లక్షలతో నూతనంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి అయినట్లు ఆయన తెలిపారు.
ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ తోటల విస్తీర్ణం పెంచేందుకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతగా 3 వేల ఎకరాల సాగు లక్ష్యానికి గాను, 1057 మంది రైతులకు చెందిన 4 వేల 200 ఎకరాలను గుర్తించి, వారిలో 308 మంది రైతులకు 1 వెయ్యి 170 ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కలను నాటడం జరిగిందని ఆయన వివరించారు. కృత్రిమ గర్భధారణ కార్యక్రమం ద్వారా మూడవ విడతలో 13 వేల 394 పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడం జరిగిందని, దీని ద్వారా 6 వేల 702 మందికి లబ్ధి చేకూరడం జరిగిందని ఆయన తెలిపారు. సరళ సాగర్ బీజ క్షేత్రంలో 2022- 23 సంవత్సరానికి 35- 40 ఎం.ఎం. సైజు గల 20 లక్షల చేప పిల్లల ఉత్పత్తి లక్ష్యంగా పనుల పురోగతి ఉన్నదని ఆయన సూచించారు.
వనపర్తి జిల్లాలో ఈ విద్యా సంవత్సరం ఎం.బి.బి.ఎస్. మొదటి సంవత్సరంలో 150 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 104 ఆరోగ్య ఉప కేంద్రాలను, పల్లె దవాఖానాలుగా ఏర్పాటు చేయుటకు ప్రతిపాదనలు పంపగా ఒక్కొక్క కేంద్రానికి రూ.20 లక్షల అంచనా వ్యయంతో 21 కేంద్రాలకు అనుమతి లభించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ లో భూ ప్రక్షాళన, శుద్దీకరణ చేపట్టి 99 శాతం రైతులకు వివాద రహిత పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. నవంబర్ 2, 2020 నుండి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 48 వేల 801 మంది స్లాట్ లు బుక్ చేసుకోగా, 48 వేల 342 మంది స్లాట్లు పూర్తి చేసి రైతులకు ఈ- పట్టాదార్ పాస్ పుస్తకాలను జారీ చేయడం జరిగిందని ఆయన వివరించారు. మార్చి 31, 2016 నుండి ఇప్పటి వరకు రూ.131 కోట్ల 77 లక్షల రూపాయలు ఖర్చుచేసి 19 వేల 918 మంది రైతులకు వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. హరితహారం కింద 2022 వానాకాలంలో 16 లక్షల 72 వేల మొక్కలు నాటుటకు లక్ష్యాన్ని నిర్దేశించగా, 287 నర్సరీల ద్వారా 40 లక్షల మొక్కలు పెంచడం జరుగుతున్నదని ఆయన తెలిపారు.
సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా బాల సదనంలోని అర్హులైన తొమ్మిది మంది ఆడపిల్లలకు జిల్లా కలెక్టర్ సంవత్సరానికి రూ.18 వేల రూపాయల చొప్పున, 15 సంవత్సరాలకు మొత్తంగా రూ. 2 లక్షల 70 వేల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ఆయన సూచించారు. ప్రభుత్వం షెడ్యూల్డు కులాల నివాస గృహ వినియోగదారులకు 101 యూనిట్లలోపు విద్యుత్తు ఉపయోగించేవారికి ఉచిత కరెంటు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా 2021-22 ఆర్థిక సంవత్సరానికి 39 వేల 913 మంది వినియోగదారులకు సుమారు రూ.62 లక్షల రూపాయల వరకు లబ్ధి చేకూరిందని ఆయన అన్నారు. షెడ్యూల్డు కులాల సహకార సేవా సంస్థ ద్వారా దళితుల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల రూపాయల విలువైన యూనిట్లను మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మొదటి విడతలో వనపర్తి నియోజకవర్గానికి 100 యూనిట్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి గ్రౌండ్ చేయడం జరిగిందని ఆయన వివరించారు.
గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా 2022-23 సంవత్సరానికి గాను బ్యాంకు లింకేజీ పథకం కింద ఒక వెయ్యి 190 ఎస్.హెచ్.జి. సంఘాలకు రూ.77 కోట్ల ఆరు లక్షల రూపాయలు రుణాలుగా ఇప్పించడం జరిగిందని ఆయన తెలిపారు. స్త్రీ నిధి పథకం ద్వారా 776 సంఘాలకు రూ.6 కోట్ల 30 లక్షల రుణ సదుపాయం కల్పించినట్లు ఆయన సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 321 పల్లె ప్రకృతి వనాలు, 255 గ్రామ పంచాయతీలలో సెగ్రిగేషన్ షెడ్లు, 277 రైతు కల్లాలు, 57 బృహత్ పల్లె ప్రకృతి వనాలను పూర్తి చేయడం జరిగిందని ఆయన వివరించారు. 2022-23 సంవత్సరానికి జిల్లాలోని 509 పాఠశాలల్లో సుమారు రూ.98 లక్షల రూపాయలు వ్యయం చేసి విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని మధ్యాహ్నం భోజనంలో అందించడం జరుగుతున్నదని ఆయన తెలిపారు. 10వ. తరగతి చదివే విద్యార్థులకు సుమారు 2 లక్షల 75 వేల పాఠ్యపుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని ఆయన సూచించారు.
జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ పథకం కింద మొదటి దశలో 3 వేల 835 గృహాలు మంజూరైనట్లు, ఇందులో ఒక వెయ్యి 172 గృహాలు పూర్తి అయినట్లు, 344 గృహాలు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని, 663 గృహాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నట్లు ఆయన వివరించారు. ఎం జి.ఎన్.ఆర్. ఈజీఎస్. పథకం కింద 225 వైకుంఠ గ్రామాలు రూ.28 కోట్ల 35 లక్షల అంచనా రూపాయల వ్యయంతో చేపట్టి, పూర్తి చేయడం జరిగిందని ఆయన సూచించారు. వనపర్తి జిల్లాలో వనపర్తి నుండి ఆత్మకూర్, వనపర్తి నుండి కొల్లాపూర్ రోడ్లను కలుపుతూ 73 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బైపాస్ రోడ్డు నిర్మాణం నిమిత్తం ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం 2022 సంవత్సరానికి సౌత్ జోన్ ర్యాంకులలో వనపర్తి మున్సిపాలిటీకి 51వ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంకు సాధించిందని ఆయన సూచించారు.
చేనేత మిత్ర పథకం క్రింద 654 మంది చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులకు 40 శాతం నూలు సబ్సిడీ క్రింద రూ.55 లక్షల 98 వేల రూపాయలను వారి ఖాతాలో జమ చేయడం జరిగిందని ఆయన వివరించారు. జూలై, 2022 మాసానికి జిల్లా సరాసరి భూగర్భ జల మట్టం 6.39 మీటర్లుగా నమోదు అయిందని, అతి తక్కువ లోతులో భూగర్భ జలాలు నమోదు అవుతున్న జిల్లాలలో వనపర్తి జిల్లా రాష్ట్రంలో ముందువరుసలో ఉందని ఆయన సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 600 మంది పేద నిరుద్యోగులకు ఎస్ ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ అందించడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లాలో “షీ” టీమ్ ద్వారా మహిళలకు రక్షణ, భరోసా కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, అన్ని పోలీసు స్టేషన్ల సీసీ కెమెరాలను అనుసంధానం చేసి, అక్కడి నుండి అధికారులు పర్యవేక్షణ చేసే విధంగా, నేరాలను చేదించే విధంగా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్ సెల్ ఏర్పాటు చేసి జిల్లాలోని ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అవగాహన కల్పిస్తూ, సైబర్ నేరాలను అరికట్టేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
పంచాయతీ శాఖ ద్వారా జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలలో 2021-22 సంవత్సరానికిగానూ రెండు కోట్ల 38 లక్షల రూపాయల పన్ను లక్ష్యానికి, 100 శాతం వసూలు చేసినట్లు ఆయన సూచించారు. జిల్లాలోని 15 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో ఉన్న రైతులకు రూ.172 కోట్లు పంట రుణాలు, 98 లక్షల బంగారుపై రుణాలు, 52 కోట్ల 32 లక్షల చిన్న మొత్తాలపై పంట రుణాలు అందించడం జరిగిందని ఆయన తెలిపారు. టి – ప్రైడ్ ద్వారా 2022-23 సంవత్సరానికి 12 మంది ఎస్సీ లబ్ధిదారులకు 46 లక్షల రూపాయలు, 66 మంది ఎస్టీ లబ్ధిదారులకు రెండు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు, మూడు మంది పి.హెచ్.సి. లబ్ధిదారులకు 10 లక్షల రూపాయలు సబ్సిడీ రాయితీలు మంజూరు చేసినట్లు ఆయన సూచించారు.
అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలలో వనపర్తిలోని అనూస్ పాఠశాల, విలియం కొండ, కొత్తకోట పబ్లిక్ స్కూల్, మానస పాఠశాల, ఎస్సీ అభివృద్ధి పాఠశాల విద్యార్థులు, చిల్డ్రన్ హోమ్, బాల భవన్ చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించినట్లు మంత్రి తెలిపారు. ఆర్మీ విద్యార్థుల వీడియో పాటల సి.డి.ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు, ఆయా శాఖలలో ప్రతిభ కనబరిచిన జిల్లా అధికారులకు, సిబ్బందికి మంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందించడం జరిగిందని తెలిపారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “స్టాల్స్” ప్రదర్శనను మంత్రి సందర్శించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, (రెవెన్యూ) డి. వేణుగోపాల్, ఏ ఎస్ పి. షాకీర్ హుస్సేన్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
……..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post