ఒకే రకమైన పంటల సాగుకు స్వస్తి పలికి రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగును అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ రైతులను అవగాహన పర్చారు.

ప్రచురణార్ధం

డిశంబరు,07,ఖమ్మం:

ఒకే రకమైన పంటల సాగుకు స్వస్తి పలికి రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగును అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ రైతులను అవగాహన పర్చారు. మంగళవారం సాయంత్రం సింగరేణి మండలం పేరుపల్లి గ్రామం రైతు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రైతులతో ముఖాముఖి అయి వచ్చే యాసంగిలో వారికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై స్వయంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలంలో జిల్లా రైతులు వరి పంటను సాగుచేసారని అట్టి వారి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. ఐతే వచ్చే యాసంగిలో రైతులు వరిసాగుకు పోకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై మొగ్గుచూపాలని వ్యవసాయ అధికారులు సూచించిన మేరకు భూసారిన్ని బట్టి అనువైన ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కలెక్టర్ రైతులకు తెలిపారు. గ్రామంలో కళ్యాణలక్ష్మీ, రైతుభీమా పెండింగ్ క్లెయిమ్లు ఉన్నట్లయితే సత్వర పరిష్కార చర్యలు తీసుకోవాలని తహశీల్దారును కలెక్టర్ ఆదేశించారు. గ్రామ పంచాయితీ కార్యాలయం ద్వారా జనన మరణ ఇతర ధృవీకరణ పత్రాలు నిర్ణీత గడువులోగా అందుతున్నాయ,. సమస్యలున్న యెడల తెలియజేయాల్సిందిగా కలెక్టర్ కోరారు. గ్రామంలో వానాకాలం పంట కోతలు మరో పదిరోజుల్లో పూర్తవుతాయని తమ గ్రామానికి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతులు కలెక్టర్కు విన్నవించారు . ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించడం జరిగిందని, కోతలు పూర్తయిన పిదప కొనుగోలు ప్రక్రియ మొదలవుతుందని కలెక్టర్ తెలిపారు. గ్రామ పంచాయితీ ద్వారా అన్ని ధృవీకరణ పత్రాలు సకాలంలోనే అందుతున్నాయని ఎటువంటి సమస్యలు లేవని రైతులు కలెక్టరు కు తెలిపారు. –

వ్యవసాయ శాఖ ఏ.డి.ఏలు సరిత, బాబురావు, మండల ప్రత్యేక అధికారి అజయ్కుమార్, తహశీల్దారు. రవికుమార్, ఎం.పి.డి.ఒ జమలా రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి దివ్య స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ స్థాయి అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post