ఒక్క ఫోటో వంద మాటలకు సమాధానం ఇస్తుందని తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వి భూపాల్ రెడ్డి పేర్కొన్నారు.

పత్రికా ప్రకటన
సంగారెడ్డి, ఆగస్టు 19:–
ఒక్క ఫోటో వంద మాటలకు సమాధానం ఇస్తుందని తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వి భూపాల్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రపంచ ఛాయా చిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్ లో ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఇట్టి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఫోటో వెనుక ఒక జ్ఞాపకం ఉంటుందని, అనుభూతి దాగుంటుందని, ఫోటోలు తీపిగుర్తు లకు నిదర్శన మన్నారు.
కవిగాంచిన దృశ్యాన్ని ఫోటోగ్రాఫర్ చూడగలుగుతాడ న్నారు. నేటి రోజుల్లో క్షణాల్లో ఎన్ని ఫోటోలనైనా తీసి వెంటనే చూడగల శాస్త్రీయ పరిజ్ఞానం ఉందన్నారు. ఒక్కో ఫోటోలో ఒక్కో నైపుణ్యత, అర్థం, పరమార్థం కనిపిస్తోందన్నారు. సెల్ఫీ లు తీయడం అందుబాటులోకి వచ్చినా, కళాత్మకంగా ఫోటో తీయడం అందరికీ సాధ్యం కాదన్నారు. ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి అన్ని విధాల తన సహకారం ఉంటుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ఫోటోలు మనసును ఆకట్టుకునే విధంగా ఉంటాయన్నారు. ఫోటో అంటే జ్ఞాపకాన్ని పదికాలాలపాటు సజీవంగా నిలిపే కళాఖండం మని ఆయన పేర్కొన్నారు. జీవితాలను నిలబెట్టే విధంగా ఫోటోలు ఉండాలన్నారు. ఈ విషయంలో జిల్లా లోని ఫోటో జర్నలిస్టులు ఎన్నో సమస్యలను తమ ఫోటోల ద్వారా చూపించ గలిగారాన్నారు. ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్లో పలు అద్భుత దృశ్యాలు, నైపుణ్య చిత్రాలు, గుండెలోతుల కదిలించే చిత్రాలను, మరిచిపోయిన గత కాలపు జ్ఞాపకాలను కళ్ళముందు నిలిపే తీసిన ఫోటోలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు.

జిల్లాలో వచ్చే సంవత్సరం జనవరి 26న ఫోటోగ్రఫీ పోటీలను నిర్వహించి అవార్డులను అందజేస్తామన్నారు. జర్నలిస్టుల డే ను కూడా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

జిల్లా ఎస్పీ రమణకుమార్ మాట్లాడుతూ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఒక్క ఫోటోగ్రాఫర్లకు మాత్రమే కాదని ఫోటోగ్రఫీ ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరిదని పేర్కొన్నారు. భాష లేనిది అర్థమున్నది ఫోటో మాత్రమేనన్నారు. చిన్న ఫొటోగ్రాఫ్ ప్రపంచం దృష్టికి తీసుకెళ్లి ఆ దేశ ఆర్థిక స్థితిగతులను మార్చిందని ఆ సంఘటనకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. ఫోటో చూసే వాళ్లతో పాటు ఫోటోగ్రాఫర్ లను ప్రభావితం చేస్తుందన్నారు. ఒక్క భావాన్ని ఫోటోతో చెప్పవచ్చని ఎలాంటి సమస్యనైనా ఫోటో రూపంలో చూపవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

అనంతరం ఫొటో జర్నలిస్ట్ లకు శాలువాతో సన్మానించి, మెమెంటోలు అందజేశారు.

ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి, ఫోటోగ్రఫీ ఆవిష్కర్త లూయిస్ డాగ్యూరె చిత్రపటానికి పూలమాల వేసారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, మాజీ శాసనసభ్యులు చింతా ప్రభాకర్, డి పి ఆర్ ఓ విజయలక్ష్మి, జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post