ఒమిక్రాన్ (కోవిడ్-19 కొత్త వేరియంట్) విస్తృతంగా, వేగంగా వ్యాప్తి చెందుచున్న దృష్ట్యా, ప్రజల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వము   భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 12న నిర్వహించే శ్రీ స్వామి వారి “తెప్పోత్సవము” మరియు 13న  నిర్వహించే ఉత్తర ద్వార దర్శనము”లకు భక్తులను అనుమతించుట లేదని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు కోవిడ్ 3వ దశ వ్యాప్తి సందర్భంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు  భక్తులకు అనుమతి లేదని,  శాస్త్రోక్తముగా కేవలము కొద్దిమంది అర్చకులు, వేదపండితులు మరియు సిబ్బంది సమక్షములో ఆంతరంగికముగా నిర్వహించు అంశంపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తర ద్వార దర్శనము నిమిత్తం ఆన్లైన్ ద్వారా సెక్టార్ టిక్కెట్లు కొనుగోలు చేసుకొన్న భక్తులకు సదరు వెబ్సైట్ ద్వారా వారికి నగదు తిరిగి చెల్లింపు చేయనున్నట్లు చెప్పారు. ఇట్టి విషయాన్ని భక్తులు గమనించి ముక్కోటి ఉత్సవాలు, తెప్పోత్సవం మరియు ఉత్తర ద్వార దర్శనం నిమిత్తం భక్తులు భద్రాచలం రావొద్దని ఆయన విజ్ఞప్తి చేసారు. ఓమిక్రాన్ వేరియంట్, కోవిడ్ వ్యాప్తి  నియంత్రణ చర్యల్లో భాగంగా  ఈ నెల 10వ తేదీ వరకు ప్రభుత్వం   ఆంక్షలు విధించినట్లు చెప్పారు.సామూహిక మత కార్యక్రమాలు, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు అనుమతి లేదని చెప్పారు. ఈ నెల 10వ తేదీ వరకు ర్యాలీలు, బహిరంగ సభలు, మత, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్ని రకాల సామూహిక కార్యక్రమాలను నిషేదించినట్లు చెప్పారు. తదుపరి  ఉత్తర్వులు వెలువడే వరకు ఆంక్షలు కొనసాగుతాయని ప్రజలు సహకరించాలని ఆయన చెప్పారు.

Share This Post