ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వయస్సు అర్హత గల ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ రెండు డోసులు తప్పనిసరిగా తీసుకొని సహకరించాలని, ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శనివారం జిల్లాలోని లక్షైట్టిపేట మున్సిపల్ పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమ నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డోసు 95 శాతం పూర్తి అయిందని, రెండవ డోసు టీకా ప్రక్రియను త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. మొదటి, రెండవ డోసులు పూర్తి స్థాయిలో తీసుకున్నప్పుడే శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొంది వైరస్‌ను ఎదుర్కొనేందుకు దోహదపడుతుందని తెలిపారు. మొదటి డోసు తీసుకొని రెండవ విడత తీసుకునే సమయం వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా వాక్సిన్ వేసుకోవాలని, రెండు డోసులు తీసుకున్న వారిపై వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాలు, అపోహలుకు గురి కాకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని, ముస్లిం నివాస ప్రాంతాలలో వ్యాక్సినేషన్ శాతం తక్కువగా ఉందని, మత పెద్దలు అందరు వ్యాక్సిన్ తీసుకొని వైరస్‌ను ఎదుర్శొనేందుకు సిద్దంగా ఉండేలా అవగాహన కల్పించాలని తెలిపారు. మున్సిపాలిటీలోని వార్డులలో ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించడంతో పాటు వైద్య సిబ్బందికి తగు సూచనలు, సలహాలు చేశారు.
ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట మున్సిపల్ కమీషనర్ వెంకటేష్, వెంకట్రావుపేట వైద్యాధికారి సతీష్‌కుమార్, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.