ఓటరు జాబితాల నవీకరణ కు సహకరించాలి రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలి…. అదనపు కలెక్టర్ వీరారెడ్డి

ఓటరు జాబితాల నవీకరణ కు సహకరించాలి
రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలి…. అదనపు కలెక్టర్ వీరారెడ్డి

తప్పులు లేని ఓటరు జాబితాల నవీకరణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి కోరారు.

మంగళవారం కలెక్టరేట్ లోని మినీ మీటింగ్ హాల్లో ప్రత్యేక ఓటరు జాబితా (రివిజన్) 2022 పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం-2022 లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను నవంబర్ 1న ప్రకటించడం జరిగిందన్నారు. ఈనెల 30 వరకు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తారని ఆయన తెలిపారు.

జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. ఓటర్ల నమోదును ప్రోత్సహించేందుకు ఈ నెల 6 ,7 ,27 ,28 తేదీలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి బూతులో బూత్ లెవెల్ అధికారితో పాటు బూత్ లెవల్ ఏజెంటు ఉండాలన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలను కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తులను పరిష్కరించి జనవరి 5, 2022న తుది ఓటరు జాబితా ప్రకటిస్తారని ఆయన పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య ప్రక్రియలో ముఖ్య ఘట్టం ఓటరు జాబితా లేనని, ఓటరు నమోదుకు ఆన్లైన్ ద్వారా ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చన్నారు. ఓటరు జాబితాల సవరణలకు బూత్లెవల్ అధికారులను నియమించామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రతి బూత్ కు బూత్ లెవెల్ ఏజెంట్ ను తప్పనిసరిగా నియమించి, వెంటనే సంబంధిత జాబితాను అందించాలని ఆయన కోరారు. ఓటరు జాబితా పై బూత్ లెవెల్ ఏజెంట్లకు పూర్తి అవగాహన ఏర్పడుతుందన్నారు. రాజకీయ పార్టీలకు ఇది మంచి అవకాశం అని ఆయన పేర్కొన్నారు.

స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు బూత్ లెవల్ ఏజెంట్ కూడా పాల్గొని ఓటరు నమోదుకు సహకరించాలన్నారు. తాజా ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ఆయన కోరారు. ఓటర్లను చైతన్యపరిచి 18 సంవత్సరాలు నిండిన వారందరిని ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు. బి ఎల్ ఏ లు ఓటరు నమోదుకు సవరణలకు సహకరించేలా చూడాలన్నారు.

ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ స్పెషల్ క్యాంపెయిన్ రోజులలో అన్ని గ్రామాలలో ముందుగా టాంటాం ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాలలో బూత్ లెవల్ అధికారుల వద్ద ఆయా దరఖాస్తులు ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంచాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి రాధికా రమణి, రెవిన్యూ డివిజనల్ అధికారులు అంబదాస్, నగేష్, ఎన్నికల విభాగం సూపరిండెంట్ ఉమర్ పాషా, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Share This Post