ఓటరు జాబితా దరఖాస్తులు పరిష్కరించాలి :: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్

ప్రచురణార్థం-1
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 13: జిల్లాలో ఓటరు జాబితాకు సంబంధించి దరఖాస్తులన్నిటిని ఈ నెల 20లోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అధికారులను ఆదేశించారు. ఓటరు ధృవీకరణ , ఓటరు జాబితా తయారీ, గరుడ యాప్, స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ మున్నగు అంశాలపై ప్రధాన ఎన్నికల అధికారి సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ అని, ఓటర్ల నమోదుకు జనవరి 1, 2022 ప్రామాణికంగా తీసుకుని ఆ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ అమలు చేయాలని తెలిపారు. ఓటర్ల జాబితాలో ఉన్న లాజికల్ పొరపాట్లు, డెమో గ్రాఫికల్ పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వారీగా జాబితా, అడ్రస్ ను, పోలింగ్ కేంద్రాల జిఐఎస్ ద్వారా క్యాప్చరింగ్, ప్రత్యామ్నాయ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు జాబితా చేపట్టిన సమాచారాన్ని సంబంధిత అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండి నూతనంగా ఓటు హక్కు పొందుతున్న వారి జాబితా ప్రత్యేకంగా రూపొందించాలని, అదే సమయంలో వివిధ వయసులో గల వారి జాబితాను ప్రత్యేకంగా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. నవంబర్ 1, 2021 న ముసాయదా ఓటరు జాబితా విడుదల చేసి, నవంబర్ 30, 2021 వరకు సదరు జాబితాపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 20, 2021లోగా అభ్యంతరాలను, ఓటర్ క్లెయిమ్స్ ను పూర్తి స్థాయిలో పరిష్కరించి, జనవరి 5, 2022 న తుది ఓటరు జాబితా రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో ఉన్న విద్యాలయాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి, ఓటు ప్రాముఖ్యతపై కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. జిల్లాలోని డిగ్రీ/వృత్తి నైపుణ్య కళాశాలలో ఎలక్టోరల్ లిటరస్ క్లబ్బులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ జిల్లా వ్యాప్తంగా స్వీప్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని, స్వీప్ కార్యక్రమాల నిర్వహణ పట్ల మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఓటర్లకు తమ పోలింగ్ స్టేషన్ సులువుగా తెలుసుకునే విధంగా భారత ఎన్నికల కమిషన్ గరుడ యాప్ ను రూపొందించిందని, దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని ఆయన ఆదేశించారు. గరుడ యాప్ వినియోగంపై బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి గరుడ యాప్ వినియోగిస్తూ పరిష్కరించాలని, వివరాలను యాప్ లో అప్లోడ్ చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా చేపట్టాలని ఆయన అన్నారు. కోవిడ్ నిబంధనలు అమలుచేయాలని ఆయన తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఇంచార్జ్ జిల్లా రెవిన్యూ అధికారి టి. శ్రీనివాసరావు, వేములవాడ ఆర్డీవో వి. లీల, సిరిసిల్ల మండల తహసీల్దార్ విజయ్ కుమార్, కలెక్టరేట్ ఎన్నికల డిటి రెహ్మాన్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post