ఓటరు జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేయాలి : ఓటర్ల జాబితా పరిశీలకులు అహ్మద్‌ నదీమ్‌

ఓటరు జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం-2022 కార్యక్రమం సంబంధిత అధికారులు సమన్వయంతో సమర్ధవంతంగా నిర్వహించి ఓటరు జాబితా ఎలాంటి తప్పులు దొర్లకుండా తయారు చేయాలని ప్రభుత్వ కార్యదర్శి, మైనార్టీ సంక్షేమ శాఖ, కార్మిక శాఖ కమీషనర్‌, మంచిర్యాల జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు అహ్మద్‌ నదీమ్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి భారతి హోళ్ళికేరి, జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌తో కలిసి రాజస్వ మండల అధికారులు, సహాయ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, బూత్‌ స్థాయి అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా పరిశీలకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలంటే ఓటరు జాబితా చాలా ముఖ్యమని, 18 సం॥ల వయస్సు నిండి అర్హత గల ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా విసృత ప్రచారం నిర్వహించాలని, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఓటు హక్కు ఓటరుగా వివరాల నమోదుపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ఓటరు జాబితా నిర్వహణ కోసం నిర్వహిస్తున్న గరుడ యాప్‌పై ప్రజలకు వివరించాలని, ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్ళి వారు వినియోగించుకునే విధంగా అధికారులు చొరవ చూపాలని తెలిపారు. దరకాస్తు ఫారం 6, 7, 8, 8ఎ పై అవగాహన కల్పించాలని, ప్రతి పోలింగ్‌ కేంద్రానికి బూత్‌ స్థాయి అధికారిని నియమించడం జరుగుతుందని, ప్రతి కళాశాలలో 18 సం॥లు నిండిన యువతీ, యువకులు తమ ఓటు హక్కు నమోదు చేసుకొనే విధంగా గోడప్రతులు, కరపత్రాల ద్వారా తెలియజేయాలని తెలిపారు. భారత ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరు పాటించాలని, ఆయా మండలాల తహళిల్హార్లు, బూత్‌ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల నాయకుల సమన్వయంతో ఓటరు జాబితా సవరణ, నూతన ఓటరు నమోదు కార్యక్రమాలు చేపట్టాలని, ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించుకోవాలని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆయా పార్టీలు సహాయ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల సూచన మేరకు బూత్‌ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఎస్‌. ఎస్‌.ఆర్‌. -2022 జరుగుతున్న ప్రకారంగా జిల్లాలో జాబితా తయారు / సవరణ చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూర్‌, మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 18 మండలాలు, 348 రెవెన్యూ గ్రామాలు, 7 మున్సిపాలిటీలు, 282 గ్రామపంచాయతీలు ఉన్నాయని, చెన్నూర్‌లో 225 పోలింగ్‌ కేంద్రాలు, బెల్లంపల్లి 222 పోలింగ్‌ కేంద్రాలు, మంచిర్యాల 279 పోలింగ్‌ కేంద్రాలు మొత్తంగా 726 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో 308 అర్బన్‌, 418 రూరల్‌ పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు, 2,96,755 మంది మహిళలు, 2,94,251 మంది పురుషులు, 45 మంది ఇతరులు, సర్వీస్‌ 603, ఎన్‌.ఆర్‌.ఓ. 29 మంది ఉన్నారని తెలిపారు. ముగ్గురు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులను నియమించడం జరిగిందని, మంచిర్యాల నియోజకవర్గానికి మంచిర్యాల రాజస్వ మండల అధికారి, బెల్లంపల్లి నియోజకవర్గానికి బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి, చెన్నూర్‌ నియోజకవర్గానికి జిల్లా అదనపు కలెక్టర్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ నెల 1 డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌ చేయడం జరిగిందని, ఈ నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, 27, 28 తేదీలలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, డిసెంబర్‌ 20వ తేదీ వరకు అన్ని దరఖాస్తులను పరిశీలించి, జనవరి 5వ తేదీన తుది జాబితా ప్రచురణ జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post