ఓటరు నమోదు పై ప్రజల్లో అవగాహన కల్పించాలి: ఛీఫ్ రేషనింగ్ ఆఫీసర్ బాల మాయాదేవి

జనగామ, నవంబర్ 27:
శనివారం నాడు జనగామ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ సమావేశానికి ఛీఫ్ రేషనింగ్ ఆఫీసర్ బాల మాయాదేవి హాజరయ్యారు. అదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్ రావు, అబ్దుల్ హమీద్, అధికారులతో ఓటరు నమోదు పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జనవరి 1, 2022 నాటికీ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కోసం తమ పేరు నమోదు చేసుకోవాలని అన్నారు. ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం స్పెషల్ సమ్మరి రివిజన్ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ఓటరు జాబితాను సవరణ చేస్తూ ఉంటుందన్నారు. జాబితాలో తొలగించాల్సిన పేర్లు ఉంటే ఫారం 7 లో ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కొత్త ఓటరు నమోదుకై ఫారం 6 ద్వారా దరఖాస్తు చేరుకోవాలని సూచించారు. జాబితా పారదర్శకంగా ఉండేందుకు పొలిటికల్ పార్టీ తరపున ప్రతి పోలింగ్ బూత్ కు ఒక బూత్ లెవల్ అసిస్టెంట్ ను నియమించుకోవాలని సూచించారు. బి.ఎల్.ఓ, బి.ఎల్.ఏ లు సమన్వయంతో పని చేసి తప్పులు లేని ఓటరు జాబితాను సిద్ధం చేసుకోవచ్చని తెలిపారు. అన్ని పొలిటికల్ పార్టీలు ప్రత్యేకంగా దృష్టి సారించి బూత్ లెవల్ అధికారులకు సహకరించాలని సూచించారు. వచ్చిన ఆన్ లైన్ ఆఫ్ లైన్ దరఖాస్తులను ఎప్పటికపుడు ఈ.ఆర్.ఓ. నెట్ లో అప్డేట్ చేస్తూ దరఖాస్తుల పరిశీలనకు బి.ఎల్.ఓ లను పంపించాలని ఈ.ఆర్.ఓ లను ఆదేశించారు. ఏ దరఖాస్తు ఎందుకు ఉపయోగపడుతుంది, వాటిని క్షేత్రస్థాయిలో ఎలా పరిశీలించాలి అనే అంశాలను అర్ధమయ్యే రీతిలో అవగాహన కల్పించాలన్నారు. రిజిస్టర్, ముసాయిదా జాబితా, ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఇంటింటికి వెళుతున్నారా, ఏ ఏ సమస్యలు ఉన్నాయి అని ఆరా తీశారు. 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించుటకు కళాశాలలలో, యూనివర్సిటీలలో ప్రత్యేక కార్యాచరణ చేయాలన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, రేడియోల ద్వారా ఓటు హక్కు నమోదు పై విస్తృతంగా ప్రచారం చేయాలనీ తెలిపారు. నియోజక వర్గాలలో SVEEP కార్యక్రమం లో ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 27, 28 శని, ఆదివారాల్లో ప్రత్యేక క్యాంపెన్ నిర్వహిస్తున్నామని వివరించారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకొనుటకు అవకాశం కల్పించినందున అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులు ముసాయిదా ఓటరు జాబితా అందుబాటులో ఉంచి, దరఖాస్తులు స్వీకరిస్తారని ఆమె తెలిపారు. చెక్ లిస్టు పెట్టాలని ఓటర్ కార్డునూ ఆదార్ కార్డుతో అనుసంధించాలని రాజకీయ పార్టి ప్రతినిధులు ఆమెకు విజ్ఞప్తి చేసారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ లు మధుమోహన్, కృష్ణవేణి, ఎస్డిసి మాలతి, డీఆర్డీఓ జి. రాంరెడ్డి, అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post