ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా కొత్తగా వచ్చిన దరఖాస్తులను , తొలగించాల్సిన పేర్లను పరిశీలించి వేగవంతంగా సవరణ జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ కలెక్టర్లను ఆదేశించారు.

బుధవారం ఓటర్ నమోదు కార్యక్రమం గరుడ యాప్ వినియోగం పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా శశాంక్ గోయల్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారందరిని ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేయడాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సూచించారు.
ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లను వారి సంబంధిత బంధువుల నుండి ఫారం-7 ద్వారా తీసుకొని లేదా సుమోటోగా తీసుకొని ఓటర్ల జాబితా నుండి వారి పేర్లను తొలగించాలని తెలిపారు. అలాగే డబుల్ ఓటర్లను గుర్తించి తొలగించాలని అన్నారు.
శాశ్వతంగా వలస వెళ్ళిన వారిని గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించాలని సూచించారు. ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండి వేరే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటరుగా నమోదై ఉంటే ఫారం-8 ద్వారా సరి చేయాలని సూచించారు ఓటర్లకు తమ పోలీస్ స్టేషన్ సులువుగా తెలుసుకునే విధంగా భారత ఎన్నికల కమిషన్ రూపొందించిందని, దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని, గరుడ యాప్ వినియోగంపై బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈవీఎం గోదాములను ప్రతి నెల తనిఖీ చేయాలని, ఆయన అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా వచ్చిన కొత్త ఓటర్ నమోదు,మార్పులు,చేర్పులు దరఖాస్తులు వేగవంతం గా పరిష్కరిస్తామని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు  జిల్లా లో ప్రతి బియల్ఓ గరుడ యాప్ ఉపయోగించడం జరుగుతుందని,  జనవరి 5న తుది జాబితా ప్రకటించడం జరుగుతుందని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జడ్.పి.సి.ఈ. ఓ.వీర బ్రహ్మ చారి,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథ రావు, తదితరులు పాల్గొన్నారు.
—————–

Share This Post