ఓటర్ల సవరణ జాబితాలు త్వరితగతిన సిద్ధం చేయాలి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలి ఓటరు హెల్ప్ లైన్ యాప్ వినియోగంపై విస్తృత ప్రచారం చేపట్టాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా. శశాంక్ గోయల్

ప్రచురణార్థం-1
రాజన్న సిరిసిల్ల, డిసెంబరు 1: ఓటర్ల సవరణ జాబితాలు త్వరితగతిన సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా. శశాంక్ గోయల్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓటర్ల నమోదు, గరుడ యాప్ వినియోగంపై జిల్లా కలెక్టర్లతో ప్రధాన ఎన్నికల అధికారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా కొత్తగా వచ్చిన దరఖాస్తులను, తొలగించాల్సిన పేర్లను పరిశీలించి వేగవంతంగా సవరణ జాబితాలు సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండిన వారందరిని ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేయడాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సూచించారు.
ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లను వారి సంబంధిత బంధువుల నుండి ఫారం-7 ద్వారా తీసుకొని లేదా సుమోటోగా తీసుకొని ఓటర్ల జాబితా నుండి వారి పేర్లను తొలగించాలని తెలిపారు. అలాగే డబుల్ ఓటర్లను గుర్తించి తొలగించాలని అన్నారు. శాశ్వతంగా వలస వెళ్ళిన వారిని గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించాలని సూచించారు. ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండి వేరే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటరుగా నమోదై ఉంటే ఫారం -8 ద్వారా సరిచేయాలని సూచించారు. జిల్లాలో ఉన్న విద్యాలయాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ఓటు ప్రాముఖ్యత పై కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. ఓటర్లకు తమ పోలీస్ స్టేషన్ సులువుగా తెలుసుకునే విధంగా భారత ఎన్నికల కమిషన్ రూపొందించిందని దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని ఆయన ఆదేశించారు. గరుడ యాప్ వినియోగంపై బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన తెలిపారు. ఈవీఎం గోదాములను ప్రతిమాసం తనిఖీ చేయాలని అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 4 లక్షల 38 వేల 916 మంది ఓటర్లు వున్నారన్నారు. నవంబర్ మాసంలో ఓటరు నమోదు, సవరణలకు 5 వేల 94 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో ఫారం-6 ద్వారా 2 వేల 94 దరఖాస్తులు రాగా 893 ఆమోదించినట్లు, 449 తిరస్కరించినట్లు, ఫారం-7 ద్వారా 2 వేల 498 దరఖాస్తులు రాగా, ఒక వేయి 111 ఆమోదించినట్లు, 20 తిరస్కరించినట్లు, ఫారం-8 ద్వారా 438 దరఖాస్తులు రాగా, 146 ఆమోదించి, 120 తిరస్కరించినట్లు, ఫారం-8ఏ ద్వారా 64 దరఖాస్తులు రాగా, 25 ఆమోదం, 15 తిరస్కరణకు గురయినట్లు, మిగులు దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు ఆయన అన్నారు. జిల్లాలో స్థానిక సంస్థలకు సంబంధించి ఒక పోలింగ్ కేంద్రం జిల్లా ప్రజా పరిషత్, సిరిసిల్ల కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు, 201 మంది ఓటు హక్కును వినియోగించుకొనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో ఎంపీటీసీలు 121, జెడ్పిటిసిలు 12, కౌన్సిలర్లు 66, ఎక్స్ అఫిషియో సభ్యులు ఇద్దరు ఉన్నట్లు ఆయన అన్నారు.
ఈ సమావేశంలో ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు, వేములవాడ ఆర్డీఓ వి. లీల, కలెక్టరేట్ ఎన్నికల ఉప తహశీల్దార్ రెహమాన్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post