ఓటర్ల సవరణ జాబితాలు వేగవంతంగా పూర్తి చేయాలి :జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

ఓటర్ల సవరణ జాబితాలు వేగవంతంగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
0000

ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం లో భాగంగా కొత్తగా వచ్చిన దరఖాస్తులను, తొలగించాల్సిన పేర్లను పరిశీలించి వేగవంతంగా సవరణ జాబితాలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక ఓటర్ల నమోదు, సవరణలపై ఆర్డివో లు, తహసిల్దార్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గాలలో ఈనెల 6వ, 7 వ తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.
18 సంవత్సరాలు నిండిన వారందరిని ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేయాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లను వారి సంబంధిత బంధువుల నుండి ఫారం-7 ద్వారా తీసుకొని లేదా సుమోటోగా తీసుకొని ఓటర్ల జాబితా నుండి వారి పేర్లను తొలగించాలని సూచించారు. అలాగే డబుల్ ఓటర్లను గుర్తించి తొలగించాలని అన్నారు. శాశ్వతంగా వలస వెళ్ళిన వారిని గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించాలని సూచించారు. ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండి వేరే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటరుగా నమోదై ఉంటే ఫారం -8 ద్వారా సరిచేసుకోవాలని సూచించారు. కరీంనగర్ నియోజకవర్గంలో 390 పోలింగ్ స్టేషన్ లు, చొప్పదండి నియోజకవర్గంలో 327 పోలింగ్ స్టేషన్లు, మానకొండూర్ నియోజకవర్గంలో 316 పోలింగ్ స్టేషన్లు, హుజురాబాద్ నియోజకవర్గంలో 306 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు.

జిల్లాలో ఫారం -6 కు సంబంధించి కరీంనగర్ లో 112, చొప్పదండిలో 178, మానకొండూర్ లో 161, హుజురాబాద్ లో 2,412 దరఖాస్తులను అప్డేట్ చేశామని తెలిపారు. ఫారం 7 కు సంబంధించి కరీంనగర్ లో 21, చొప్పదండిలో 42, మానకొండూర్ లో 301, హుజరాబాద్ లో 3 దరఖాస్తులు అప్డేట్ అయ్యాయని తెలిపారు. ఫారం 8 కి సంబంధించి కరీంనగర్ లో 71, చొప్పదండిలో 39, మానకొండూరు 29, హుజురాబాద్ లో 20 దరఖాస్తులు అప్డేట్ చేసినట్లు తెలిపారు. ఫారం 8 ఏ, కు సంబంధించి కరీంనగర్ లో 16 హుజురాబాద్ లో 13 దరఖాస్తులు అప్డేట్ అయ్యాయని కలెక్టర్ తెలిపారు. ఇంకా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను బి ఎల్ వో ల సహాయంతో పరిశీలించి జాబితాల సవరణ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత తహసీల్దార్లకు సూచించారు.

ఈ సమావేశంలో మానకొండూర్ ఈ.ఆర్.ఓ ప్రియాంక, కరీంనగర్ ఈ.ఆర్.ఓ ఆనంద్ కుమార్, చొప్పదండి ఈ.ఆర్.ఓ శ్రీలత, హుజురాబాద్ ఈ. ఆర్. ఓ సిహెచ్. రవీందర్ రెడ్డి, కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజురాబాద్ ల అసిస్టెంట్ ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.

Share This Post