ఓటర్ నమోదుకు కంకణ బద్దులు కండి – యువతకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ గా తమ పేరును నమోదు చేసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులు, పరిసరాలలో ఉన్న అర్హులైన వారందరి పేర్లను ఓటర్ గా నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ యువతకు పిలుపునిచ్చారు. గురువారం రోజున జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో యువ ఓటర్ పండుగ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా పాల్గొని కలెక్టర్ మాట్లాడుతూ, జనవరి 1, 2022 నాటికీ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు వారి పేర్లను ఓటర్ గా నమోదు చేసుకోవాలని అన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో వివిధ పోటీలను నిర్వహిస్తూ చైతన్య పరిచే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో యువత పాత్ర కీలకమైందని, వివిధ పోటీలలో యువత పాల్గొనడం తో పాటు ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అన్నారు. వచ్చే రెండు మాసాల్లో జిల్లాలోని అర్హత గల ప్రతి ఒక్కరి పేరును, ఏ ఒక్కరిని వదిలి పెట్టకుండా ఓటర్ జాబితాలో నమోదు చేయాలనీ అన్నారు. దేశ నిర్మాణంలో యువత సృజనాత్మకంగా, ఆలోచనాత్మకంగా ఉండి సమస్యల సాధకులుగా మారాలని కోరుతున్నాను. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో పండుగ వాతావరణంలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యాస, వకృత్వ, చిత్రలేఖనం, ఆటపాటల పోటీలను నిర్వహిస్తూ యువతను ఉత్తేజ పరుస్తూ, అవగాహన కల్పిస్తూ ఓటర్ నమోదు కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాను ఓటర్ జాబితాలో వంద శాతం నమోదు చేయడం లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ మాట్లాడుతూ, వచ్చే మూడు మాసాల్లో ఓటర్ జాబితాలో సవరణలు, మార్పులు , చేర్పులు, నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. స్వచ్ఛమైన ఓటర్ జాబితాను తయారు చేయడానికి అన్ని అంశాలలో శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. కళాశాలల విద్యార్థులు, ఎన్.ఎస్.ఎస్., ఎన్.సి.సి. విద్యార్థులచే సామజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్.ఎస్.ఎస్. కో ఆర్డినేటర్ సత్యనారాయణ మాట్లాడుతూ, ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్ల ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, యువతను ఓటర్ గా నమోదు చేయడంలో సహకరిస్తామని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ రహత్ ఖానం మాట్లాడుతూ, యువత తమ పేర్లను బాద్యతాయుతంగా ఓటర్ గా నమోదు చేసుకోవాలని అన్నారు. కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు, శ్రీ వెంకటేశ్వర సంగీత నాట్య కళానిలయం విద్యార్థులు నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు పాటల రూపంలో ఓటర్ నమోదుపై వివరించారు. అనంతరం వివిదః పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు మెమొంటో కలెక్టర్ అందజేశారు. కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చిన రెండు సంవత్సరాల సుదీక్ష ను కలెక్టర్ ప్రత్యేకంగా సన్మానించారు. మాన్య, ఉత్కర్ష, హిమజ లు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు, దివిజ వీణ వాయిద్యం సభికులను మంత్రముగ్దుల్ని చేశాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ గజిటెడ్ హై స్కూల్ నం.1 విద్యార్థులు ప్రదర్శించిన డాన్స్ లు ప్రేక్షకులను ఆనందింపజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జాడి రాజేశ్వర్, ఆదిలాబాద్ పట్టణ తహసీల్దార్ భోజన్న, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా, నాయబ్ తహసీల్దార్లు శ్రీవాణి, సాంకేతిక సహాయకులు కే.ఉమాకాంత్, ఎన్.ఎస్.ఎస్., ఎన్.సి.సి., వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post