ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి- అదనపు కలెక్టర్ యస్ మోతిలాల్

ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి- అదనపు కలెక్టర్ యస్ మోతిలాల్

పదవ తరగతి, ఇంటర్మీడియేట్ ఓపెన్ స్కూల్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ యస్. మోతిలాల్ అన్నారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  వివిధ శాఖల అధికారులతో ఓపెన్ స్కూల్ వార్షిక పరీక్షల సమన్వయ నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఈ నెల 31 నుండి జూన్ 18 వరకు టైం టేబుల్ ప్రకారం ఉదయం గం. 8:30 ని. నుండి గం.11:30 నిమిషాల వరకు ఆయా కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

జిల్లాలోని 4 కేంద్రాల్లో నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, అచ్చంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కల్వకుర్తి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, కొల్లాపూర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల్లోని 4 కేంద్రాలలో 540 మంది పదవతరగతి విద్యార్థులు, అదేవిధంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నాగర్ కర్నూల్, గాంధీ మెమోరియల్ పాఠశాల కొల్లాపూర్, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల కల్వకుర్తి, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల అచ్చంపేట 4 కేంద్రాలలో 555 మంది ఇంటర్మీడియేట్ ఓపెన్ స్కూల్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఆయా పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు పరీక్షలు ప్రశాంతంగా రాయడానికి అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు.

అవసరమైన బందోబస్తు, ఆర్ముడ్ ఫోర్స్ ఏర్పాటు చేయాలనీ పోలీస్ అధికారులకు సూచించారు. ప్రశ్నాపత్రాలు ఆయా స్టోరేజ్ కేంద్రాలకు తరలించే సమయంలో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలనీ కోరారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల పరిధిలో బందో బస్తు ఏర్పాటు చేయాలనీ అన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేసేలా సంబంధిత చర్యలు చేపట్టాలని రెవెన్యూ, పోలీస్ అధికారులకు తెలిపారు.  కేంద్రాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్ వద్ద బందోబస్త్ నిర్వహించాలని అన్నారు. అన్ని పరీక్ష సెంటర్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలు నిర్వహించే సమయంలో ఆయా ప్రాంతాల్లోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని అన్నారు. పరీక్షా సమయానికి ముందే బస్సుల సమయాలను రీ షెడ్యూల్ చేయాలనీ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. జవాబు పత్రాలను సంబంధిత కేంద్రాలకు పంపేందుకు పోస్టల్ అధికారులు సహకరించాలని సూచించారు. వేసవి కాలం దృష్ట్యా ఆయా పరీక్షా కేంద్రాల్లో మెడికల్ క్యాంపులను, సిబ్బందిని నియమించాలని, ORS ప్యాకెట్ లు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు సంబందించిన సమాచారాన్ని మీడియా పరంగా విద్యార్థులకు తెలిసే విధంగా ప్రచారం నిర్వహించాలని జిల్లా పౌర సంబంధాల అధికారిని ఆదేశించారు. జూన్ 21 నుండి 25 వరకు నాగర్ కర్నూల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో 313 మంది విద్యార్థులకు ఇంటర్మీడియేట్ ఓపెన్ స్కూల్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ నాగలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, డి.ఎస్.పి దీపక్ చంద్ర, ఏసీ రాజశేఖర్ రావు, కోశాధికారి లక్ష్మీనారాయణ, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసులు, ఓపెన్ స్కూల్ జిల్లా కో – ఆర్డినేటర్ నాగరాజ్, వెంకట్, వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్, పంచాయతీరాజ్, ఆర్టిసి, ఎలక్ట్రిసిటీ, పోస్టల్ వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post