ఓమిక్రావ్ వేరియంటితో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ ముందస్తు రక్షణ చర్యలు, కోవిడ్-19 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఇంకనూ వ్యాక్సినేషన్ తీసుకోని వారు సత్వరమే టీకా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

ప్రచురణార్ధం

జనవరి,12 ఖమ్మం,

ఓమిక్రావ్ వేరియంటితో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ ముందస్తు రక్షణ చర్యలు, కోవిడ్-19 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఇంకనూ వ్యాక్సినేషన్ తీసుకోని వారు సత్వరమే టీకా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసారు. బుధవారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అడిషనల్ డి.సి.పి గౌస్, ఆలమ్, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభితో కలిసి ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నియంత్రణ, కోవిడ్-19 నుండి ముందస్తు రక్షణ చర్యలపట్ల జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. ఈ నెల 1వ తేదీ నుండి కరోనా కేసులు క్రమంగా పెరిగాయని, రాబోయె రెండు మూడు రోజుల సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలు ఎక్కువగా జనసమూహంగా ఉండకుండా జాగ్రత్తపడాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్లలు ధరించి భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలని, ఇంకనూ ఎవరైనా కోవిడ్-19 వ్యాక్సినేషన్ తీసుకోని వారు వెంటనే వ్యాక్సినేషన్ తీసుకోవాలని కలెక్టర్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసారు. కరోనా మూడవ దశ ఉదృతి నేపథ్యంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని, పండుగ సందర్భంగా షాపింగ్, ప్రయాణ సందర్భాలలో జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కలెక్టర్ అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 18 సంవత్సరాలు పైబడిన 10 లక్షల 78 వేల 270 మందికి మొదటిడోసు, 88 లక్షల మందికి రెండవ డోసు వ్యాక్సినేషన్ అందించడం జరిగిందని, దీనితోపాటు 15 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలు 36,505 మందికి కోవిద్ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. రెండు డోసులు తీసుకుని 9 నెలల గడువు పూర్తి చేసుకున్న వారికి బూస్టర్ డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా జిల్లలో ప్రారంభమైందని ఇప్పటి వరకు 2453 మందికి బూస్టర్ డోసు వేయడం జరిగిందన్నారు. కోవిడ్-19 నుండి రక్షణకు గాను ప్రభుత్వ పరంగా అన్ని సదుపాయాలు, అవకాశాలు ఉన్నప్పటికి ప్రజలు నిర్లక్ష్యం చేయకూడదని, ప్రతి ఒక్కరూ రెండవ డోసును తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, సబ్ సెంటర్లో వ్యాక్సినేషన్ అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కంట్రోల్ రూము పున: ప్రారంభిస్తున్నామని, 1077 టోల్ ఫ్రీ. నెంబర్కు కాల్ చేయడం ద్వారా, 9063211298 నెంబర్కు వాట్సాప్ ద్వారా కోవిడ్-19కు సంబంధించిన అవసరాలకై సందేహాల నివృత్తికి సంప్రదించవచ్చని కలెక్టర్ తెలిపారు. కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని ప్రతిరోజు 4 నుండి 7 వేల టెస్ట్ లు  చేయడం జరుగుతున్నదని కలెక్టర్ తెలిపారు. ఓమిక్రాన్ వ్యాప్తి, కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో అన్ని సదుపాయాలతో అన్ని విధాల సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ అన్నారు. కోవిడ్-19 చికిత్సను ప్రభుత్వ పరంగా గుర్తింపు పొందిన ప్రయివేటు ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా పర్యవేక్షణ ఉంటుందని, నిబంధనలను ఉల్లంఘించిన ప్రయివేటు ఆసుపత్రులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు.

అడిషనల్ డి.సి.పి గౌస్ ఆలమ్ మాట్లాడుతూ దేశంలో కరోనా మూడవ దశ వ్యాప్తి క్రమ క్రమంగా పెరుగుతుందని జిల్లాలో గత వారం రోజులలో కేసుల సంఖ్య పెరిగిందని ప్రజలందరు ముందస్తు రక్షణ చర్యలను ఖచ్చితంగా పాటించాలని, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజ్ చేసుకోవడం. వంటి కనీస జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని ఆయన అన్నారు. కోవిడ్-19 నిబంధనలను అతిక్రమించే వారిపై పోలీసు శాఖాపరంగా చర్యలు తీసుకుంటున్నామని, మాస్క్ లేకుండా తిరగేవారికి వెయ్యి రూపాయలు. జరిమానా విధించడం జరుగుచున్నదని, ప్రస్తుతం ఈ నెల 20 వ తేదీ వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలపై ఆంక్షలు అమలులో ఉన్నాయని ప్రజలందరూ సహకరించాలని అడిషనల్ డి.సి.పి గౌస్ అలమ్ విజ్ఞప్తి చేసారు.

నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ నగరంలోని వాణిజ్య, వ్యాపారస్తులందరూ తమ షాపులలో కోవిడ్-19 నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, మాస్క్ ధరిస్తేనే అమతించేలా సూచికబోర్డులను షాపుల ముందు ప్రదర్శించాలని, షాపులో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు ఉండాలని ఆయన అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఇంకనూ టీకా తీసుకోని వారిని గుర్తించి ఇంటింటికి తిరిగి రెండవ డోసు టీకాలు వేయిస్తున్నట్లు ఆయన తెలిపారు.

జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా॥బి. వెంకటేశ్వర్లు, జిల్లా సర్వేలెన్స్ అధికారి డా॥రాజేష్ కోవిడ్- 19 జిల్లా నోడల్ అధికారి డా॥ సురేష్, డా॥ సైదులు, తదితరులు పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post