కడుకుంట్ల గ్రామ పంచాయతీలోని ఆయిల్ పామ్ నర్సరీని సందర్శించిన డిప్యూటీ కమిషనర్, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ దిలీప్ కుమార్ శ్రీవాస్తవ

పత్రికా ప్రకటన.       తేది:29.12.2021, వనపర్తి.

ప్రభుత్వం ఆదేశాల మేరకు వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చునని,  వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించాలని డిప్యూటీ కమిషనర్, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ దిలీప్ కుమార్ శ్రీవాస్తవ సూచించారు.
బుధవారం వనపర్తి మండలం, కడుకుంట్ల గ్రామ పంచాయతీలోని ఆయిల్ పామ్ నర్సరీని డిప్యూటీ కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లాలోని కడుకుంట్ల నర్సరీలో ఏర్పాటు చేసిన ఒక లక్ష 80 వేల ఆయిల్ పామ్ మొక్కలు జూలై నెల నాటికి రైతులు నాటుటకు సిద్ధంగా ఉంటాయని, మరో ఒక లక్ష 80 వేల విత్తనాలు ప్రభుత్వం నుండి సరఫరా అయినట్లు, ఆగస్టు నెలలో వీటిని పూర్తిస్థాయిలో విత్తనాలు వేయుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
రైతులు ఆయిల్ పామ్ తోటలు సాగు చేయుటకు అనుకూలమైన, లాభదాయకమైన పంటగా చెప్పవచ్చునని ఆయన అన్నారు. ఒక ఎకరాకు 57 మొక్కలను త్రికోణాకారంలో 9 మీటర్ల దూరంలో సాగు చేయాలని, ఒక ఆయిల్ పామ్ మొక్కకు రూ.117/- లు ఖర్చు అవుతుందని, ప్రభుత్వం రూ.84/- లు రాయితీ ఇస్తుందని, రైతులు కేవలం రూ.33/- లు మాత్రమే పెట్టుబడి అవుతుందని ఆయన తెలిపారు.
ఆయిల్ పామ్ మొక్కలు నాటిన ఐదు సంవత్సరాలకు ఆర్థిక లాభాలు అందుతాయని ఆయన సూచించారు. నాలుగు సంవత్సరాలు అంతర్ పంటలు   ఐన వేరుశనగ, పెసర్లు, ఉలవలు, అలసందలు, అన్ని రకాల కూరగాయలు సాగు చేసుకొనుటకు అనుకూలంగా ఉంటుందని ఆయన వివరించారు. అంతర్ పంటలకు ప్రభుత్వం విత్తనాల కొరకు రూ.2 వేలు, పంటల సేద్యం, భూమి దున్నుటకు రూ.2 వేలు మొత్తం రూ.4 వేల రూపాయలు మొదటి నాలుగు సంవత్సరాలు ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. ఆయిల్ పామ్ తోటల ద్వారా అధిక లాభాలు పొందవచ్చునని ఆయన సూచించారు.
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి కే సురేష్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో వివిధ మండలాలలో పైలెట్ ప్రాజెక్టు కింద ఆయిల్ ఫామ్ తోటలను 250 ఎకరాలలో విజయవంతంగా సాగు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయిల్ పామ్ తోటలు సాగు చేయుటకు ఇప్పటివరకు ఆరు వేల ఎకరాల వరకు దరఖాస్తులు అందాయని, జూన్ -జూలై నెలల్లో మొక్కలు నాటుటకు రైతులు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వివరించారు. ఒక ఎకరాకు పది టన్నుల గెలలు దిగుబడి ఉంటుందని, ఏజెన్సీల ద్వారా మార్కెటింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఆయన సూచించారు.
మన రాష్ట్రంలో ఆయిల్ పామ్ తోటల సాగుపై రైతులకు ప్రోత్సాహకాలు అందించి, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుటకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు. అధిక మొత్తంలో రాయితీలు కల్పిస్తున్నదని, వ్యవసాయ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించి ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు.
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి కే సురేష్, ప్రియునిఖ్ కంపెనీ ప్రతినిధులు రామ్మోహన్ రావు, సత్యనారాయణ, నర్సరీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడినది.

Share This Post