కరకట్ట ఏర్పాటు పనుల్లో వేగం పెంచాలి:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 8: మానేరు వాగుపై ఏర్పాటు చేయనున్న కరకట్ట పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాయి నగర్ వద్ద 3 కి.మీ. పొడవున రూ. 31 కోట్ల 95 లక్షల వ్యయ అంచనాలతో మానేరు వాగుపై కరకట్ట ఏర్పాటుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కరకట్ట మానేరు వాగు ఎడమవైపు 60 ఫీట్లు, కుడివైపు 10 ఫీట్ల వెడల్పుతో తంగళ్ళపల్లి రోడ్ వంతెన నుండి సాయి బాబా గుడి వరకు ఉంటుందని ఆయన అన్నారు. కరకట్ట ఏర్పాటుకు స్థల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. కరకట్ట వెంబడి స్థల హద్దులు, జియో కోఆర్డినెట్స్ నిర్ధారించాలన్నారు. కరకట్ట ఏర్పాటు స్థలంలో తాటి, ఈత చెట్ల సమస్యలు పరిష్కరించాలని ఆయన తెలిపారు. కరకట్ట ప్రదేశంలో ఉన్న విద్యుత్ స్తంభాలు తొలగించాలన్నారు. రహదారి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రవేశము, నిష్క్రమణ దారులు చక్కగా ఉండాలన్నారు. ఇది జిల్లాకు ముఖ్యమైన, ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని, అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన తెలిపారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పని పూర్తికి కాలపరిమితితో కార్యాచరణ రూపొందించాలని, కార్యాచరణ మేరకు పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా ఇంచార్జ్ రెవిన్యూ అధికారి టి. శ్రీనివాసరావు, ఇర్రిగేషన్ ఎస్ఇ పి. శివకుమార్, ఇఇ ఏ. అమరెందర్ రెడ్డి, ఆర్ అండ్ బి ఇఇ ఏ. కిషన్ రావు, సెస్ ఏడిఇ ఎస్. శ్రీనివాస్, సర్వే ఇన్స్పెక్టర్ వి. శ్రీనివాస్, టెక్నీకల్ డైరెక్టర్ ఎస్ఎల్ఆర్ కెవి. గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Share This Post