కరివేద పద్ధతిలో వరిసాగు విధానాన్ని రాష్ట్రమంతటా అవలంభించేందుకు రైతులకు అవగాహన కల్పించి వారి సందేహాలను నివృత్తి చేసేందుకు ఖమ్మం జిల్లా పర్యటనకు వరంగల్ జిల్లా రైతుల బృంధాన్ని తీసుకొచ్చామని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

ప్రచురణా

ఆగష్టు 05 ఖమ్మం:

తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధిస్తున్న కరివేద పద్ధతిలో వరిసాగు విధానాన్ని రాష్ట్రమంతటా అవలంభించేందుకు రైతులకు అవగాహన కల్పించి వారి సందేహాలను నివృత్తి చేసేందుకు ఖమ్మం జిల్లా పర్యటనకు వరంగల్ జిల్లా రైతుల బృంధాన్ని తీసుకొచ్చామని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివుని పాలెంలో పరివెదజల్లే పద్ధతిలో వరిసాగు చేస్తున్న చిల్లగుండ్ల సత్యనారాయణ పరిపాలాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, స్టేషన్ ఘన్ పూర్ శాసనసభ్యులు తాటికొండ రాజయ్య, వరంగల్ జిల్లా రైతంగం, ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా సదాశివునిపాలెం రైతువేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా సతుపల్లి మండలం సదా శివునిపాలెంలో సాగుచేస్తున్న వరివెదజల్లే పద్ధతి రైతులకు ఎంతో లాభసాటిగా ఉందని, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వస్తుందని, నాటు ఖర్చు తగ్గడంతో పాటు ఎకరానికి 10 వేల వరకు ఆదా అవుతుందన్నారు. వివిధ పంటల సాగులో రైతులకు ఆధునిక పద్ధతులను తెలియజేసి రైతాంగాన్ని లభసాటిగా చేయాలన్నదే గౌరవ ముఖ్యమంత్రివర్యుల సంకల్పమని, తదనుగుణంగా రైతు సంక్షేమం కోసం 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్తు, ఎకరానికి 10 వేల రూపాయలు పెట్టుబడి సహాయం ప్రభుత్వం అందిస్తుందన్నారు. కష్టకాలంలో కూడా రాష్ట్రానికి ఆదాయం తగ్గినప్పటికి ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగలేదని, ఉచిత విద్యుత్ కొరకు రాష్ట్ర ప్రభుత్వం 16 వేల కోట్లు విద్యుత్ బోర్డుకు చెల్లిస్తున్నదని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. రైతులను సంఘటితపర్చి వ్యవసాయానుబంధ రంగాలలో ఆధునిక పద్ధతులు, మెళుకువలు తెలియజేయడంతో పాటు రైతులకు తమ సమస్యలు చర్చించుకొని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పొందేందుకు రైతువేదికలను ఏర్పాటు చేసుకున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఆసరా పెన్షన్ పొందేందుకు 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు వయోపరిమితిని తగ్గించి 57 సంవత్సరాలు వారికి కూడా పెన్షన్ అందించేందుకు ఈ నెల 4వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఆసరా పెన్షన్లకు గాను ప్రభుత్వం 12 వేల కోట్లకుపైగా ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని మంత్రి తెలిపారు. దళితులు ఆర్ధిక స్థితి గతులను మార్చే విధంగా రైతుబంధు పథకానికి ముఖ్యమంత్రివర్యులు శ్రీకారం చుట్టారని, 50 వేల లోపు ఋణాలు పొందిన రైతాంగానికి ఋణమాఫీకి కూడా ప్రభుత్వం నిర్ణయించిందని, ఆగష్టు 15 నుండి ఇట్టి ఋణ మాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో 16 వేల ఎకరాలలో వరి వెదజల్లే పద్ధతిన వరిసాగు జరుగుతున్నదని, అందులో 10 వేల ఎకరాలు కేవలం సత్తుపల్లి నియోజకవర్గంలోనే ఉందన్నారు. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పామాయిల్ సాగును మరింత ప్రోత్సహించి రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచాలనే గౌరవ ముఖ్యమంత్రివర్యుల ఆలోచన మేరకు వరంగల్ రైతాంగం క్షేత్రస్థాయి పరిశీలనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పామాయిల్ సాగు పరిశీలనకు వచ్చారని. ఆయన అన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు చిరునామాగా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకతను సంతరించుకుందని,  57 సంవత్సరాల వారికి పెన్షన్ అందించాలనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన ఖమ్మం జిల్లాలో 35 వేల మందికి, ఉమ్మడి జిల్లాలో 56 వేల మందికి పెన్షన్ అందనున్నదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అభివృద్ధి పనులలో భాగంగా ఇప్పటికే సత్తుపల్లి నియోజకవర్గంలో రోడ్లు అభివృద్ధికి పి.ఎం.జి.ఎస్.వై కింద 34 కోట్లు మంజూరు కాగా కేవలం సత్తుపల్లి మండలంలో రోడ్ల అభివృద్ధికి 18 కోట్లు మంజూరు అయ్యాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు తాటికొండ రాజయ్య, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, వరంగల్ జిల్లా రైతాంగంతో కలిసి కరివేద పద్ధతిలో సాగు చేస్తున్న చిల్లగుండ్ల సత్యనారాయణ పొలాన్ని సందర్శించి వరంగల్ జిల్లా రైతులకు జిల్లా వ్యవసాయ శాఖాధికారులు, శాస్త్రవేత్తలు రైతుల ద్వారా అవగాహన కల్పించి వారి సందేహాలను నివృత్తి చేసారు. రైతు చిల్లుగుండ్ల సత్యనారాయణ తన పొలంలో చేస్తున్న వారి వెదజల్లే పద్ధతిని వివరిస్తూ దుక్కి చదునుగా దున్ని జూన్-8 న వరి విత్తనాలను వెదజల్లామని 15 నుండి 20 రోజులలోపు కలుపు మందు కొట్టామని ఈ పద్ధతి వల్ల కూలీల కొరత ఉండదని, వర్షాభావ పరిస్థితులలో కూడా పంటకు ఎటువంటి నష్టం ఉండదని, 15 రోజుల ముందే పంట చేతికొస్తుందని, ఎకరానికి 10 వేల వరకు ఖర్చు ఆదా అవుతుందని తన అనుభవాలను వరంగల్ జిల్లా రైతంగానికి తెలియజేశారు.

అదనపు కలెక్టర్ ఎన్ మధుసూధన్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీమతి విజయనిర్మల, జిల్లా ఉద్యాన వన శాఖాధికారి శ్రీమతి అనసూయ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, జిల్లా పంచాయితీ అధికారి ప్రభాకర్రావు, పంచాయితీరాజ్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు జి.వి.చంద్రమౌళి, గ్రామీణ నీటి సరఫరా పర్యవేక్షక ఇంజనీరు కె.శ్రీనివాసరావు, స్థానిక సర్పంచ్ శ్రీమతి తుంబూరు సరస్వతి, జడ్పీ, టి.సి కూసంపూడి రామారావు, ఎం.పి.టి.సి కరుణకుమారి, స్థానిక ప్రజాప్రతినిధులు సదాశివుని పాలెం గ్రామ రైతులు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post