కరీంనగరాన్ని సుందరంగా, పర్యాటకంగా తీర్చిదిద్దడమే లక్ష్యం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

కరీంనగరాన్ని సుందరంగా, పర్యాటకంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

పత్రికా ప్రకటన.
తేదీ: 11-1-2022
కరీంనగర్

కరీంనగరాన్ని సుందరంగా, పర్యాటకంగా తీర్చిదిద్దడమే లక్ష్యం :: రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

  • రూ.410 కోట్లతో మానేర్ రివర్ ఫ్రంట్ నిర్మాణం
  • రివర్ ఫ్రంట్ స్థల పరిశీలన చేసిన మంత్రి, నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి
  • వైకుంఠ ఏకాదశి రోజున టెండర్లకు పిలుపు, అనంతరం సీ.ఎం.తో పూజలు
  • మొదటి దశలో 3.75 కి.మీ.ల మానేర్ రివర్ ఫ్రంట్ పనులు

కరీంనగరాన్ని సుందరంగా, పర్యాటకంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

మంగళవారం దిగువ మానేరు డ్యాం గేట్ల కింది భాగంలో మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం పనుల ప్రారంభం కోసం రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ అధికారులు, టూరిజం అధికారులు, కలెక్టర్ తో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా తీగలవంతెన సమీపంలో పాత్రికేయులతో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సి.ఆర్. ఆదేశాల మేరకు కరీంనగరాన్ని సుందర నగరంగా, పర్యాటకంగా తీర్చి దిద్దాలనే లక్ష్యంతో ప్రణాళీకబద్దంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. కరీంనగర్ కు ముఖ ద్వారాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రథమంగా కరీంనగర్- వరంగల్ పాత రోడ్డులో తీగల వంతెనను నిర్మిస్తున్నామని, దీనిపై డైనమిక్ లైట్లు ఏర్పాటు చేస్తున్నామని, ఈ వంతెనను ఈ ఏడాది మే నెలలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్ ముఖద్వారంగా హైదరాబాద్, వరంగల్ వెళ్లే వారికి, వచ్చే వారికి అద్భుతంగా కనిపిస్తుందని అన్నారు. రూ.లు 410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ ను మొదటి దశలో 3.75 కి.మీ వరకు పూర్తి చేస్తామని, రెండవ దశలో 6.25 కి.మీలు పూర్తి చేస్తామని అన్నారు. డిల్లీకి చెందిన ఐ.ఎన్.ఎస్. కన్సల్టెన్సీ మానేర్ రివర్ ఫ్రంట్ పనులను ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేస్తుందని మంత్రి తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్ కు ఇరువైపులా పార్కులు, వాటర్ ఫౌంటేన్స్, థీమ్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, మ్యూజికల్ ఫౌంటేన్స్, ఆట స్థలాలు, గార్డెన్స్ లాంటివి ఏర్పాటు చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి కె.సి.ఆర్. కృషి వల్ల కరీంనగర్ కు స్మార్ట్ సిటీ వచ్చిందని, అలాగే మానేర్ రివర్ ఫ్రంట్ కల కూడా సాకారమవుతుందని మంత్రి తెలిపారు. వైకుంఠ ఏకాదశి రోజున టెండర్లు పిలిచి, టెండర్లు ఖరారైన తర్వాత ముఖ్యమంత్రితో పూజలు నిర్వహించి మానేర్ రివర్ ఫ్రంట్ పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు. మానేర్ రివర్ ఫ్రంట్ లో 12 నుండి 13 ఫీట్ల లోతు వరకు నీరు నిల్వ ఉంటుందని, ఇందులో స్పీడ్ బోట్లు, క్రోజ్ బోట్లు పర్యాటకులకు ఆకర్షణగా, ఆహ్లాదాన్ని కలిగిస్తాయని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశానికే గర్వకారణంగా మానేర్ రివర్ ఫ్రంట్ నిలుస్తుందని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు మానేర్ రివర్ ఫ్రంట్ ముఖద్వారంగా ఉంటుందని, పర్యాటకంగా అభివృద్ది చెందుతుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 147 టి.ఎం.సిల నీరు ప్రాజెక్టులో ఉంటుందని అన్నారు. గతంలో తెలంగాణ ఎడారిగా ఉండేదని, కాళేశ్వరం ప్రాజెక్టు, మానేరు రివర్ ఫ్రంట్ తో తెలంగాణ జియోగ్రఫి మారుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 638 చెక్ డ్యాంల నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయని, మరో 500 చెక్ డ్యాం ల నిర్మాణాలను చేపడుతామని రజత్ కుమార్ తెలిపారు. భూగర్బ జలాల పెంపుకోసమే చెక్ డ్యాంల నిర్మాణమని, ఇప్పటికే 5 మీటర్ల మేరకు భూగర్బ జలాలు పెరిగాయని అన్నారు. పాడి పంటలతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుందని తెలిపారు.

అనంతరం మానేర్ రివర్ ఫ్రంట్ డిజైన్ చేసిన పోస్టర్లను మంత్రి గంగుల కమలాకర్, నీటి పారుదల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తో కలిసి ఆవిష్కరించారు.

ముందుగా ఉదయం ఎల్.ఎం.డి. కంట్రోల్ రూం మీటింగ్ హాల్ లో మానేర్ రివర్ ఫ్రంట్ డిజైన్ పై రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, నీటి పారుదల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఎమ్మెల్యే రసమయి బాల కిషన్, జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, ఇంజనీర్ ఇన్ చీఫ్ అధికారులు మురళీధర్, శంకర్, వెంకటేశ్వర్లు, టూరిజం ఎం.డి మనోహర్ రావు, ఈ.డి. శంకర్ రెడ్డి, తదితర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ.ఎన్.సి కన్సల్టెన్సీ ప్రతినిధి ప్రతీక్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మానేర్ రివర్ ఫ్రంట్ గురించి వివరించారు. అనంతరం మానేర్ డ్యాం గేట్లపై నుండి మానేర్ రివర్ ఫ్రంట్ వెళ్లే స్థలాన్ని పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, నీటి పారుదల శాఖ క్వాలిటీ కంట్రోల్ సి.ఈ వెంకట కృష్ణ, ఎస్.ఈ. శివ కుమార్, దేవెందర్ రెడ్డి, జిల్లా టూరిజం అధికారి వెంకటేశ్వర్ రావు, ఆర్డీఓ ఆనంద్ కుమార్, కరీంనగర్, తిమ్మాపూర్ తహశిల్దార్లు సుధాకర్, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post