కరీంనగర్ ను అనేమియా ముక్త్ జిల్లాగా చేద్దాం

కరీంనగర్ ను అనేమియా ముక్త్ జిల్లాగా చేద్దాం

  • దేశవ్యాప్తంగా అనేమియా నిర్మూలనలో
  • ప్రత్యేక పోషకాహార పంపిణీలో కరీంనగర్ జిల్లా ఆదర్శవంతం
  • గర్భిణీలు తమ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
  • రక్తహీనతను నివారించేందుకు ఉట్నూర్ ఐటిడిఏ నుండి మిల్లెట్ ఫుడ్
  • జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

000000

     కరీంనగర్ ను అనీమియా ముక్త్ జిల్లాగా మార్చేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

     శనివారం పట్టణంలోని టిఎన్జిఓ ఫంక్షన్ హాల్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషన్ అభియాన్, లోప పోషణ రహిత కరీంనగర్ కొరకు పోషణ లోప పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ పంపిణీ కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ మాట్లాడుతూ మహిళల్లో రక్తహీనత నుండి విముక్తి లక్ష్యంగా కరీంనగర్ జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని, ఈ దిశగా విజయం సాధిస్తూ ముందుకెళ్లడం అభినందనీయమని అన్నారు. ఎనిమియా నిర్మూలనలో దేశవ్యాప్తంగా కరీంనగర్ ఆదర్శవంతంగా నిలవడం అభినందనీయమని, లోప పోషణ ఉన్న చిన్నారులకు తృణ దాన్యాలతో కూడిన ప్రత్యేక ఆహారాన్ని ఈ జిల్లాలో అందించడం గొప్ప విషయం అని పేర్కొన్నారు.  ఈ సందర్భంగా లోప పోషణ  ఉన్న చిన్నారులకు అందించే ప్రత్యేక తృణదాన్యాలతో కూడిన పోషకాహారాన్ని ఆవిష్కరించారు. జిల్లాలో అంగన్వాడీలు, ఆశాల కార్యకర్తల సహకారంతో మహిళలందరికీ రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఇది దేశంలోనే మొట్టమొదటగా కరీంనగర్ జిల్లాలో చేస్తున్న కార్యక్రమనీ పేర్కొన్నారు. రక్తహీనత ఉన్న వారికి సరైన పోషకాహారం అందించడం, ఐరన్ మాత్రలు ఇవ్వడం వంటి వాటి ద్వారా రక్తహీనతను అరికడుతున్నారని తెలిపారు.

     జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ రక్తహీనత వల్ల మహిళల్లో అనేక దీర్ఘకాలిక సమస్యలు వస్తాయని అన్నారు. కరీంనగర్ జిల్లాను  రక్తహీనత నిర్మూలన( అనీమియా ముక్త్ )జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో మొత్తం మంది మహిళలకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం కరీంనగర్ లో  ప్రారంభించినట్లు తెలిపారు. ముందుగా అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు రక్త పరీక్ష నిర్వహించి, వారిలో రక్తహీనత ఉన్న వారిని గుర్తించామని తెలిపారు. అనంతరం ప్రతి మహిళకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. మంచి విజయం సాధించిన ఆశ వర్కర్లకు, అంగన్వాడి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. లోప పోషణ ఉన్న చిన్నారులకు అంగన్వాడీలో ఇచ్చే ఆహారమే కాకుండా అదనంగా ఉట్నూరు ఐటిడిఏ నుండి మిల్లెట్ ఫుడ్ ను తెప్పించి ఆహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మిల్లెట్ తో కూడిన వంట చేసి మూడు నెలలు అందిస్తే లోప రక్తహీనత ఉన్నవారు మెరుగవుతారు అన్నారు. మామ్, సామ్ ఉన్న  ఇంటింటికి వెళ్లి  కౌన్సిలింగ్ చేయాలన్నారు

     అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ మాట్లాడుతూ లోప పోషణ ఉన్న చిన్నారులను గుర్తించి వారి బరువును పెంచే దిశగా ప్రతి మంగళవారం 10 నిమిషాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళవారం ఒక గ్రామంలో సమావేశం నిర్వహించి గర్భిణీలు, బాలింతలు చిన్నారులలో లోప పోషణ ఉన్న వారిని గుర్తిస్తామని అన్నారు. వారు సాధారణ బరువు వచ్చేవరకు అంగన్వాడీ టీచర్లు ప్రత్యేక ఆహారం అందిస్తారని తెలిపారు. గృహ సందర్శనలు చేసి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇస్తారని అన్నారు. సంవత్సరకాలంగా ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు. అనంతరం అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పోషకాహార మేళాను జడ్పీ చైర్పర్సన్, జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ మేళా లో సుమారు 300 రకాల పోషకాహారాన్ని అంగన్వాడీ టీచర్లు ప్రదర్శించారు.

         ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కే.సబితా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో ప్రియాంక ,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా కార్పొరేటర్ జితేందర్, సిడబ్ల్యుసి చైర్మన్ ధనలక్ష్మి, జిల్లా ఆరోగ్య అధికారి జువేరియా, డిఆర్డిఏ పిడి శ్రీలత, వయవృద్ధుల అసోసియేషన్ అధ్యక్షులు సముద్రాల జనార్దన్ రావు, మోసం అంజయ్య  ,  పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, మహిళలు, ఇతరులు పాల్గొన్నారు

Share This Post