కరీంనగర్ KDCC Bank శతవసంతాల ఉత్సవాల సందర్భంగా పద్మనాయక కల్యాణ మండపంలో జ్యోతి ప్రజ్వలన మరియు పథక ఆవిష్కరణ చేసి మాట్లాడుతున్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర పౌర సరఫరాలు, బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ కమిటీ వైస్ చెర్మెన్ బి.వినోద్ కుమార్ పాల్గొన్న నాబార్డ్ చైర్మన్ G R చింతాల, MLA లు రసమయి బాలకిషన్, సజాయ్ కుమార్, ZP చైర్ పర్సన్లు కనుమల్ల విజయ,పుట్ట మధు, KDCCB చైర్మన్ కొండూరు రవీందర్రావు. జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్. (కరీంనగర్ జిల్లా ).

రైతాంగానికి అండగా నిలుస్తున్న సహకార బ్యాంకులు

సహకార రంగానికి దేశవ్యాప్త గుర్తింపు

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

ఘనంగా కే డి సి సి బి శత వసంత ఉత్సవాలు

పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్, నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు
000000
రైతాంగానికి సహకార బ్యాంకులు అండగా నిలుస్తున్నాయి అని, నష్టాల్లో నడిచిన సహకార బ్యాంకులు లాభాల బాట పట్టించేందుకు పాలకవర్గం చేసిన కృషి గణనీయమైనది అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ స్థాపించి శత వసంతాలు పూర్తి అయిన సందర్భంగా మంగళవారం కరీంనగర్ పద్మనాయక కల్యాణ మండపంలో నిర్వహించిన ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, నాబార్డ్ చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు, కే డి సి సి బ్యాంక్ చైర్మన్ కొండూరు రవీందర్రావు తో కలిసి జ్యోతి ప్రజ్వలన, పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ 1921 సమాచారంలో స్థాపించిన కే డి సి సి బ్యాంక్ ఇరవై ఐదు సంవత్సరాల పాటు నష్టాల్లో నడిచినప్పటికి, 2005 సంవత్సరంలో బ్యాంకు పగ్గాలు చేపట్టిన రవీందర్ రావు బ్యాంకును వేల కోట్ల లాభాల బాటలో నడిపించడం అభినందనీయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 7 సంవత్సరాల కాలంలో రాష్ట్రం వ్యవసాయము, డైరీ, మత్స్య, పాడి పరిశ్రమలలో గణనీయమైన అభివృద్ధి సాధించిందని తెలిపారు. అంచనాలకు మించి వరి ధాన్యం పండిందని, ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆన్నారు. నాబార్డ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పి పరిష్కారం చూపాలని కోరారు. కే డి సి సి బ్యాంక్ ఇదే స్ఫూర్తిని కొనసాగించి రైతులకు అండదండలు అందించాలని తెలిపారు.

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పాలకవర్గం సిబ్బంది కృషి వల్లనే అభివృద్ధి పథంలో పయనిస్తుందని, రైతుల మన్ననలు అందుకుంటోంది అని అన్నారు. రైతుల ఆర్థిక వ్యవస్థలకు మూలాలైన నాబార్డ్, ఇఫ్కో, క్రిబ్ కో, నాఫెడ్ సంస్థల చైర్మన్లు కే డి సి సి బి శత వసంతాల ఉత్సవాలకు హాజరు కావడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లనే కాలేశ్వరం ప్రాజెక్ట్ ఏర్పడి పుష్కలంగా నీటితో కళకళలాడుతూ పంటలు పండుతున్నాయి అని అన్నారు. సహకార బ్యాంకులు వ్యక్తిగత పూచీకత్తుపై రుణాలు అందించాలని, తద్వారా యువత ఆర్థిక అభివృద్ధి సాధించే వీలు కలుగుతుందని తెలిపారు.

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ సహకార బ్యాంక్లు మిగితా బ్యాంకులకు దీటుగా మారాయని అన్నారు. రైతులకు అండగా నిలుస్తున్న బ్యాంకులలో సహకార బ్యాంకులు అగ్రగామి గా నిలుస్తున్నాయి ప్రశంసించారు.

జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ మాట్లాడుతూ తాను కూడా మొదట్లో డి సి సి బి ఖమ్మం లో పని చేశానని తెలిపారు. సహకార బ్యాంకులు సరిగా పని చేయవని అందరూ భావిస్తారని, కానీ సహకార బ్యాంకులు చక్కగా పనిచేస్తాయి అనడానికి కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నిదర్శనమని తెలిపారు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు.

నాబార్డ్ చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు మాట్లాడుతూ దేశానికి రాజైనా తల్లికి కొడుకే నని, తాను నాబార్డ్ చైర్మన్ అయినప్పటికీ తెలుగోడి నేనని అన్నారు. నా బార్డ్ కు వచ్చే ఆదాయంలో సింహ భాగం తెలుగు రాష్ట్రాల నుంచే వస్తుందని అన్నారు. సహకార వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే ప్రాథమిక సహకార సంఘాలు పటిష్టంగా ఉండాలని పేర్కొన్నారు. వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి రైతులు విముక్తి పొందారంటే అందుకు కారణం సహకార బ్యాంకు లేనని అన్నారు. వాణిజ్య బ్యాంకులకు దీటుగా కెడిసిసి బ్యాంక్ అన్ని రకాల రుణాలు అందిస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. అంతకు ముందు ఆయన కేడీసీసీ బ్యాంక్ ఆవరణలో శత వసంత ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్ ను ఆవిష్కరించారు. సహకార బ్యాంక్ పతాకాన్ని సైతం ఆవిష్కరించారు.

కే డి సి సి బ్యాంక్ చైర్మన్ కొండూర్ రవీందర్ రావు సభాధ్యక్షత వహించి మాట్లాడుతూ వంద సంవత్సరాల కేంద్ర సహకార బ్యాంక్ ప్రగతి పథంలో పయణించేందుకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందని అన్నారు. 2005 సంవత్సరంలో బ్యాంక్ బాధ్యతలు చేపట్టినప్పుడు సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని తెలిపారు. పాలకవర్గం సిబ్బంది కృషి వల్ల బ్యాంకును కష్టాలనుంచి గట్టెక్కించి లాభాల బాట పట్టిన అని తెలిపారు. ప్రస్తుతం బ్యాంక్ దేశం లో నెంబర్ వన్ గా ఎదిగిందని అన్నారు. 2008 సంవత్సరంలో బ్యాంకును కంప్యూటరీకరణ చేశామని, 2009 సంవత్సరంలో సిరిసిల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యలను నివారించేందుకు రుణాలిచ్చి ఆదుకున్నామని తెలిపారు. రైతులకే కాకుండా గృహ నిర్మాణాలకు సైతం తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చామని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహించడానికి కోసం వెయ్యి మందికి పై చదువులు, విదేశాలకు వెళ్లేందుకు సహకారం అందించారని తెలిపారు. ముద్ర రుణాలు కూడా అందించామని అన్నారు. కే డి సి సి బి కింద పనిచేసే 128 సహకార సంఘాలను అభివృద్ధి చేశామని, అవి బాగా పని చేస్తున్నాయని తెలిపారు. యంగ్ ఛాంపియన్స్ పేరిట 42 వేల మంది విద్యార్థులను కే డి బి సి సి బ్యాంకు తో టై అప్ చేశామని తెలిపారు.

కే డి సి సి బి శత వసంత ఉత్సవాల సందర్భంగా బ్యాంకు మొబైల్ యాప్ ను నాబార్డ్ చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు, శత వసంతాల సంచికను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, బ్యాంకు క్యాలెండర్ ను మంత్రి కొప్పుల ఈశ్వర్, బ్యాంకు డైరీని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆవిష్కరించారు.

 

 

Share This Post