కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్

కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్వీయ రక్షణ ఒక్కటే మార్గమని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఓమిక్రాన్ పట్ల భయాందోళనలు వద్దు, జాగ్రత్తలు పాటించి జయిద్దామని పిలుపునిచ్చారు. కరోనా కాస్త తగ్గుముఖం పట్టి కోలుకుంటున్న సమయంలో దక్షిణాఫ్రికా నుండి కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వెలుగు చూడడంతో పాటు దేశంలో కేసులు నమోదు అవుతున్న సమయంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు పెట్టుకొని, భౌతిక దూరం పాటిస్తూ, తరచు చేతులను శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. కరోనా కట్టడికి, రక్షణ పొందేందుకు మన చేతిలో ఉన్న ప్రధాన అస్త్రాలు మాస్క్, వ్యాక్సిన్ అని ప్రతి ఒక్కరు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు.
జిల్లాలో 7,67,248 మంది జనాభాకు గాను 18 సంవత్సరాలు పై బడిన వారు 5,48,340 మంది ఉన్నట్లు గుర్తించి లక్ష్యానికి మించి 5,54,827 మందికి కోవిడ్ -19 మొదటి డోసు టీకా అందించామని తెలిపారు. రెండవ డోసుగా 2,40,905 మంది మాత్రమే అనగా 43.42 శాతం మాత్రమే తీసుకున్నారని, మొదటి డోసు తీసుకున్న 84 రోజులు పూర్తైన వారు వెంటనే విధిగా రెండవ డోసు తీసుకోవాలని , టీకానే శ్రీరామ రక్ష, కరోనా కట్టడికి బ్రహ్మాస్త్రమని అన్నారు. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రాణాపాయం ఉండదని, కరోనా వచ్చినా స్వల్ప లక్షణాలతో వెళ్ళిపోతుందని అన్నారు. జిల్లాలో కూడా వ్యాక్సినేషన్ కొరత లేదని, రెండు లక్షల డోసులు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నెల 22 నాటికి అన్ని జిల్లాలలో వ్యాక్సినేషన్ పూర్తి కావాలని లక్ష్యంగా నిర్దేశించిందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఓమిక్రాన్ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే ఆరు రేట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందని, అయినా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధం ఉందని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయట తిరగరాదని కోరారు. ఇంటి నుండి బయటికెళుతున్నప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, వ్యాపార సముదాయాలలో, షాపింగ్ మాల్స్ లో తిరిగే జనాలతో పాటు వ్యాపార యజమానులు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించాలని లేకుంటే వేయి రూపాయల జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. ఇందుకు సంబందించి కరోనా వేవ్ ఉదృతంగా ఉన్న గత మార్చి లోనే ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని అన్నారు. కాగా కరోనా తగ్గుముత్తం పట్టినందున చాలా మంది మాస్కులు ధరించడం లేదని, భౌతిక దూరం పాటించడం లేదని గుర్తించిన ప్రభుత్వం తాజాగా వచ్చిన కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ను దృష్టిలో ఉంచుకొని గతంలో ఇచ్చిన కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, ఉల్లంఘించిన వారిపై వేయి రూపాయల జరిమానా విధించాలని స్పష్టం చేసిందని కలెక్టర్ తెలిపారు.

Share This Post