కరోనా మహమ్మారి వేళ వైద్య సేవలు అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కరోనా సమయంలో ఫ్రెంట్ లైన్ వర్కర్స్ కు శనివారం రోజున తలమడుగు మండలం ఉమ్రి గ్రామంలో కాడే స్వామి స్వచ్చందంగా సన్మాన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా మహమ్మారి సమయంలో ఎంతోమంది వైరస్ బారినపడి అనారోగ్యంతో అవస్థలు పడ్డారని, కొంతమంది మరణించారని అన్నారు. జిల్లాలో వైద్య సిబ్బంది, ఇతర శాఖల అధికారులతో వైద్య సేవలు అందించడం జరిగి, మరణాల రేటు తగ్గించడం జరిగిందని అన్నారు. గ్రామంలో వందశాతం వ్యాక్సిన్ జరిగినందున గ్రామస్తులకు, వైద్యం,ఇతర శాఖల సిబ్బందికి అభినందనలు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. గ్రామంలో వైద్య సేవలు అందించిన ఆశా కార్యకర్తలు సునీత,అనిత, అనసూయ, రేణుక,సావిత్రి, గంగుబాయి, సరస్వతి, లక్ష్మీ, ఏ.ఎన్. ఎం. లు అదేళ్ళమ్మ, లక్ష్మీ, మెడికల్ ఆఫీసర్లు డా.రాహుల్, డా.ఆలేఖ్య లను శాలువలతో కలెక్టర్ సన్మానించారు. అదేవిధంగా స్థానిక ప్రజలకు కరోనా పై వివరిస్తూ వైద్య సిబ్బందికి సహకరించిన ప్రజాప్రతినిధులను కూడా సన్మానించారు. తొలుత కలెక్టర్ కు గిరిజన సంప్రదాయ పద్దతిలో, గుస్సాడీ నృత్యాలతో స్వాగతం పలికారు. కొమురం భీమ్ విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో DMHO డా.నరేందర్ రాథోడ్, అదనపు DMHO డా.సాధన, DIO డా.విజయ సారథి, సర్పంచ్ ఎడ్మ గోపాల్, ఎంపీటీసీ మెశ్రం హనుమంతు, డీసీసీబి డైరెక్టర్ పెందుర్ వనమాల, తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్, ఎంపీడీఓ రమాకాంత్, RMO డా.చందు, గ్రామస్తులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.