కరోనా వ్యాప్తి నియంత్రణకు వ్యాక్సినేషన్ ఒక్కటే ఆయుధమని జిల్లాలో ఇంకనూ కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకొని వారు తమంతట తాము ముందుకు వచ్చి వ్యాక్సినేషన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు.

ప్రచురణార్ధం |

డిశంబరు-01, ఖమ్మం –

కరోనా వ్యాప్తి నియంత్రణకు వ్యాక్సినేషన్ ఒక్కటే ఆయుధమని జిల్లాలో ఇంకనూ కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకొని వారు తమంతట తాము ముందుకు వచ్చి వ్యాక్సినేషన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్  ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ, థర్డ్ వేవ్ (ఓమైక్రాన్) పరిరక్షణ చర్యలను కలెక్టర్ పాత్రికేయులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 10 లక్షల 60 వేల 576 మందికి మొదటి డోసు కోవిడ్-19 టీకాలు అందించి రాష్ట్రంలోనే 95 శాతంతో ఖమ్మం జిల్లా అగ్రస్థానంలో ఉందని కలెక్టర్ తెలిపారు. వీరిలో 5 లక్షల 50 వేల మంది సెకండ్ డోస్ కూడా పూర్తి చేసుకున్నారని. మిగిలిన వారు గడువు పూర్తయిన ఆధారంగా తమంతట తాము ముందుకు వచ్చి రెండవ డోస్ టీకా తీసుకోవాలని అదేవిధంగా ఇంకనూ ఒక్క డోస్ కూడా తీసుకోని వారు 50 వేల మంది ఉన్నారని, గర్భీణీలు, బాలింతలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ప్రతి ఒక్కరు కోవిడ్-19 వ్యాక్సినేషన్ తీసుకోవచ్చని ఎలాంటి ఆపోహలకు లోనుకాకుండా వారందరు కూడా స్వయంగా ముందుకు వచ్చి టీకా వేయించుకొని స్వీయ రక్షణ పొందాలన్నారు. జిల్లాలో వ్యాక్సినేషన్ డోసుల కొరత లేదని 1 లక్ష 93 వేల 420 డోస్ లు నిల్వ ఉన్నాయని, అదేవిధంగా 1 లక్ష 80 వేల సిరంజిలు నిల్వ ఉన్నాయని కొత్త వేరియేషన్ ను ఆపడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని దీన్ని జిల్లా ప్రజలందరూ సద్వినియోగ పర్చుకోవాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో ప్రతిరోజు నాలుగు నుండి ఐదు వేల టెస్టులు నిర్వహిస్తున్నామని అవసరమయితే ఇంకనూ టెస్టుల సంఖ్యను పెంచుతామని కలెక్టర్ తెలిపారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆర్.టి.పి.సి.ఆర్ ల్యాబ్ ఉన్నదని ప్రతిరోజు రెండు వందల టెస్టులు జరుగుతున్నాయని దీనితో పాటు అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసి ఆర్.టి.పి.సి.ఆర్. టెస్టుల సంఖ్యను కూడా పెంచుతామని కలెక్టర్ తెలిపారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు అందుబాటులో ఉందని ఆయన అన్నారు. ఇటీవలే విదేశాలలో వ్యాప్తి చెందుతున్న ఓమైక్రాన్ పట్ల పూర్తి అప్రమత్తంగా ఉన్నామని ప్రధానంగా యూరప్, సౌతాఫ్రికా, బ్రెజిల్, చైనా, మారిషస్, న్యూజీలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్ దేశాల నుండి వచ్చే వారికి ఎయిర్‌పోర్ట్‌లోనే పరీక్షలు నిర్వహించి క్వారెంటైన్ లో ఉంచడం జరుగుతున్నదని, మన జిల్లాకు సంబంధించి ఆయా దేశాల నుండి ఎవ్వరైనా వచ్చిన యెడల పరిసర ప్రాంతాల వారు అట్టి సమాచారాన్ని స్థానిక అధికారులకు తెలియపర్చి హోమ్ క్వారెంటైన్ పాటించేలా సహకరించాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేసారు. దీనికి గాను ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రయివేటు ఆసుపత్రులలో కోవిడ్-19 వైద్యాన్ని పర్యవేక్షించేందుకు స్పెషల్ ఆఫీసర్‌ను నియమిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం కేసుల సంఖ్య అధికంగా లేదని ప్రజలందరూ స్వీయరక్షణ చర్యలు పాటించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గిందన్నారు. ప్రస్తుతం థార్ద్వేవ్ ప్రమాదం పొంచి యున్నందున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్‌లను ధరించాలని అన్ని విధాల రక్షణ కల్పిస్తుందని కలెక్టర్ అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కోవిడ్-19 రక్షణ చర్యలు చేపట్టామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా॥మాలతీ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి అప్పారావు. పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post