కరోనా సమయంలో జిల్లాలో 50 పడకల మాత శిశు ఆరోగ్య కేంద్రం అందుబాటులో రావడం కొల్లాపూర్ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు

కరోనా సమయంలో జిల్లాలో 50 పడకల మాత శిశు ఆరోగ్య కేంద్రం అందుబాటులో రావడం కొల్లాపూర్ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.  మంగళవారం మధ్యాహ్నం కొల్లాపూర్ లోని రామాపురం గ్రామం వద్ద రూ. 700 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన 50 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సహచర మంత్రి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొల్లాపూర్ శాసన సభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వసతులు, సిబ్బందితో  ఈ రోజు మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని, స్థానిక శాసన సభ్యుల కోరిక మేరకు  రాబోయే రోజుల్లో సకల సౌకర్యాలతో ఈ ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకలకు స్థాయి పెంపొందించడం జరుగుతుందన్నారు.  అదేవిదంగా కొల్లాపూర్ కు డయాలసిస్ సెంటర్ మంజూరు చేయనున్నట్లు తెలిపారు.  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తగా 3 మెడికల్ కళాశాలలు మంజూరు చేయడం జరిగిందని త్వరలో వాటిని ప్రారంభించుకోవడం ద్వారా ప్రజలకు వైద్య పరంగా అనేక సౌకర్యాలు అందుబాటులో రానున్నాయని పేర్కొన్నారు.  తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి తొలి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని, ఇందులో భాగంగా  ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో వైద్య పరంగా ఆసుపత్రులు, వైద్య సిబ్బంది, వైద్య పరికరాలు సమకూర్చుకోవడం జరుగుతుందన్నారు.

వచ్చే సంవత్సరం నుండి రాష్ట్రలో  మన ఊరు మన బడి కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని ఇందులో భాగంగా అన్ని చోట్లా ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రారంభించడం జరుగుతుందన్నారు.  దీనికొఱకు అన్ని పాఠశాలలకు అన్ని సౌకర్యాలు సమకూర్చడం జరుగుతుందన్నారు.  కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ  పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పించేందుకు 7280 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు నిధులు సమకూర్చుకోవడం జరుగుతుందన్నారు.  పాఠశాలను రెండు దశల్లో అప్గ్రేడ్ చేయడం జరుగుతుందని తెలిపారు.  ప్రతిపక్షాలు ఏ మంచి పని చేసిన జీర్ణించుకోలేక పోతున్నాయని, పేద ప్రజలకు ఆంగ్ల మాధ్యమం ద్వారా విద్యను అందిస్తామంటే గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసన సభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో కొల్లాపూర్ లో 50 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రారంభించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. దీనిని అన్ని సౌకర్యాలతో 100 పడకలకు అప్గ్రేడ్ చేయాలని, డయాలసిస్ సెంటర్ ను మంజూరు చేయాలని మంత్రిని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు పి. రాములు, కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, సాయిచంద్,  జిల్లా పరిషత్ చైర్మన్ పద్మావతి,  ప్రభుత్వ  విప్ కుచుకుళ్ల దామోదర్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్, ఎమ్మెల్సి కసి రెడ్డి నారాయణ రెడ్డి,  కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, నాగర్ కర్నూల్ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి, అదనపు కలెక్టర్ మను చౌదరి,     ఆర్డీఓ హనుమ నాయక్,  జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సుధాకర్ లాల్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post