కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారికి బాలల కోసం పీఎం కేర్స్ పథకం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో బాలల కోసం పీఎం కేర్స్ ప్రయోజనాలు వివరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

పత్రిక ప్రకటన

తేదీ : 30–05–2022

కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారికి బాలల కోసం పీఎం కేర్స్ పథకం

జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో బాలల కోసం పీఎం కేర్స్ ప్రయోజనాలు వివరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన  వారి కోసం “బాలల కోసం పీఎం కేర్స్” పథకం ప్రవేశపెట్టడం జరిగిందని  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం ఢిల్లీ నుండి అన్ని జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో  “బాలల కోసం పీఎం కేర్స్” పథకం కింద ప్రయోజనాలను ప్రధాన మంత్రి విడుదల చేశారు. ఈ సందర్బంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ… ప్రాణాంతకమైన కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమకు ఎంతో సన్నిహితులైన వారిని కోల్పోయారని, మహమ్మారి వలన తల్లిదండ్రులను కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. అలాంటి పిల్లలకు పీఎం కేర్స్ పథకం ప్రయోజనాలు అందాలన్నారు. 2020 మార్చి 11వ తేదీ నుంచి 2022 ఫిబ్రవరి 28వ తేదీ  మధ్య అనాథలైన బాలలు ఈ పథకం కింద లబ్ధి పొందడానికి అర్హులని తెలిపారు. అలాంటి పిల్లలకు సమగ్ర సంరక్షణ, భద్రతతో పాటు  భోజన, నివాస సౌకర్యం కల్పించడం ఈ పథకం లక్ష్యమని, దీని ద్వారా ఉపకార వేతనం, విద్యాభ్యాసం ద్వారా వారికి సాధికారత కల్పిస్తామన్నారు. దీనికోసం బాలలకు 23 సంవత్సరాలు వచ్చే దాకా రూ.10 లక్షల నిధి సమకూరుతుందని… వారి శ్రేయస్సు కోసం ఆరోగ్య బీమా కూడా కల్పిస్తుందన్నారు. ఈ పథకం కింద బాలలు తమ పేర్లు నమోదు చేసుకోవడం కోసం pmcaresforchildren.in పోర్టల్ ఏర్పాటు చేయబడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఉన్నత విద్యాభ్యాసానికి విద్యా రుణ సదుపాయం కల్పిస్తుందని… ఈ రుణం వడ్డీ భారాన్ని పీఎం కేర్స్ భరిస్తుందన్నారు. 23 సంవత్సరాల వయసు వరకు ఆయుష్మాన్ భారత్ యోజన కింద రూ.5 లక్షల ఆరోగ్య బీమాతో పాటు ఆరోగ్య బీమా ప్రీమియం సీఎం కేర్స్ భరిస్తుందని అన్నారు. 18 సంవత్సరాల వయసు వరకు వ్యక్తిగత అవసరాలకు నెలవారీ ఆర్థిక సహాయం…23 సంవత్సరాల వయసు నిండిన వెంటనే పీఎం కేర్స్ నుంచి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందుతుందన్నారు. ఒకటో తరగతి నుంచి (1–-12)  తరగతుల మధ్య పిల్లలకు ఏడాదికి రూ.20 వేల స్కాలర్ షిప్, టెక్నికల్ విద్యకు స్వనత్ స్కాలర్ షిప్, రూ.50 వేల ఎక్స్ గ్రేషియా చెల్లించడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు సజీవంగా ఉండడం పిల్లలకు ఎప్పుడూ అతి పెద్ద అండ అని… నేడు వారు లేని ఈ సమయంలో పిల్లల బాధ్యతలు గతం కన్నా ఎంతగానో పెరిగాయన్నారు. వారి జీవితంలో ఏర్పడిన లోటును భర్తీ చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదని, బాలల బంగారు భవిష్యత్తును ఆకాంక్షిస్తూ దేశం వేసిన ముందడుగే బాలల కోసం పీఎం కేర్స్ పథకం అన్నారు. పిల్లల కలలు సాకారం చేయడంలో సహాయం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని ఈ పథకం భరోసా ఇస్తుందని, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో  రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు రాగజ్యోతి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాకు చెందిన 13 మంది పిల్లలకు   “బాలల కోసం పీఎం కేర్స్” పథకం పాస్ బుక్, ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జనారోగ్య యోజన కార్డు, స్నేహపాత్ర సర్టిఫికెట్ ను పిల్లలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యుసీ ఛైర్మన్ రాజారెడ్డి, జిల్లా ఇంఛార్జి సంక్షేమాధికారిణి (డీడబ్ల్యువో)  వాణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఇంతియాజ్ రహీమ్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post