కలెక్టరేటు లో జరిగిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్. (కరీంనగర్ జిల్లా).

డయల్ యువర్ కలెక్టర్  కార్యక్రమానికి  అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలి

ఒకసారి ఫోన్ చేసి  ఫిర్యాదు చేసిన వారు మళ్లీ ఫోన్ చేయకుండా సమస్య పరిష్కరించాలి

అదనపు  కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్

                  00000

డయల్ యువర్ కలెక్టర్  కార్యక్రమానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని, ఒకసారి ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వారు మళ్ళీ అదే సమస్యపై  ఫోన్ చేయకుండా చూడాలని అదనపు కలెక్టర్ జీ.వీ. శ్యామ్ ప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు.

   సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా  అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి జిల్లా కేంద్రానికి రాలేని ప్రజలు తమ  సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నారని  అన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వచ్చిన ప్రజాసమస్యలు పెండింగ్ లో  పెట్టకుండా వెంట వెంటనే పరిష్కరించాలని  అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వివిధ కార్యాలయాలకు సంబంధించి కోర్టులో  పెండింగ్ లో వున్న కేసు లకు  వెంటనే కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని అధికారులకు సూచించారు. కౌంటర్ ఫైల్ దాఖలు చేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రామడుగు మండలం   నుంచి రమేష్ మాట్లాడుతూ వెదిర గ్రామం నుంచి కిలోమీటర్ పొడుగునా రోడ్డు పాడైందని దానికి మరమ్మతులు చేయించాలని కోరగా సర్వే చేయించి మరమ్మతు చేయిస్తామని ఆదనపు కలెక్టర్ తెలిపారు.  జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామం నుంచి రాజయ్య మాట్లాడుతూ తన భూమి ధరణిలో రిజిస్ట్రేషన్ కావడం కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నానని ఇప్పటివరకు ధరణి లో నమోదు కాలేదని తెలిపారు. తాసిల్దార్ పరిశీలిస్తారని అదనపు కలెక్టర్ తెలిపారు.  తిమ్మాపూర్ మండలం నుంచి బిల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ తన కూతురు డిగ్రీ చదువుతుంది అని వసతి గృహంలో సీట్ ఇప్పించాలని కోరగా సంబంధిత శాఖ  అధికారులకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి సీట్ ఇప్పిస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు. తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ ఐకెపి సెంటర్లో ధాన్యం బస్తా లకు హమాలీలు డబ్బులు తీసుకుంటున్నారని వెంకట నరసయ్య ఫిర్యాదు చేయగా, పరిశీలించి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ పౌరసరఫరాల శాఖ అధికారులకు సూచించారు. రామడుగు మండలం నుంచి లింగయ్య మాట్లాడుతూ గ్రామం మధ్యలో డైరీ ఫామ్ ఏర్పాటు చేస్తున్నారని, దీనివల్ల ప్రజలందరికీ ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు.  పరిశీలించి   గ్రామస్తులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని జిల్లా పంచాయతీ అధికారిని అదనపు కలెక్టర్ ఆదేశించారు. కరీంనగర్ భగత్ నగర్ నుంచి హనుమంత రెడ్డి మాట్లాడుతూ స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా భగత్ నగర్ లో డ్రైనేజీ పనులను అసంపూర్తిగా నిలిపివేశారని తెలుపగా వెంటనే పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు.

Share This Post