జిల్లాలో వంద శాతం కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
కోవిడ్ వ్యాక్సినేషన్ పై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
00000
జిల్లాలో వంద శాతం కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ అన్నారు.
గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏ పీ ఓ లు, వైద్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే సింగిల్ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న వారికి రెండవ డోస్ కూడా తీసుకునేలా చూడాలని తెలిపారు. ముఖ్యంగా హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో తప్పనిసరిగా కోవిడ్ మొదటి, రెండవ డోసు వ్యాక్సినేషన్ లను ప్రజలు తీసుకునేలా చూడాలని అన్నారు. ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు, ఎన్నికల సిబ్బంది తప్పనిసరిగా రెండవ డోస్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని అన్నారు. జిల్లాలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ తీసుకొని, రెండవ డోసు వ్యాక్సినేషన్ తీసుకొనని వారందరూ వ్యాక్సినేషన్ చేయించుకునేలా చూడాలని తెలిపారు.హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికలలో అభ్యర్థి, ఎలక్షన్ ఏజెంట్, పోలింగ్ ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్, డ్రైవర్ మొదలగు వారు కోవిడ్ టీకా ప్రోటోకాల్ ప్రకారం మొదటి డోసు కోవిడ్ టీకా తీసుకున్న వారు , రెండవ డోసుకు అర్హత లేని వారు, పోలింగ్, కౌంటింగ్ తేదీలకు 72 గంటల లోపు ఆర్.టి.పి.సి.ఆర్. నెగిటివ్ రిపొర్టు సమర్పిస్తే వారిని ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతిస్తామని కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. అలాగే ఒక డోసు కూడా కోవిడ్ టీకా తీసుకోకుండా ఉన్న అభ్యర్థి, ఎలక్షన్ ఏజెంట్, పోలింగ్ ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్, డ్రైవర్ మొదలగు వారు పోలింగ్ ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియకు 48 గంటల లోపు ఆర్.టి.పి.సి.ఆర్. నెగిటివ్ రిపోర్టు సమర్పిస్తే అనుమతిస్తామని తెలిపారు. హుజురాబాద్, జమ్మికుంట, కమలాపూర్ లో ఏర్పాటుచేసిన ఆర్ టి పి సి సెంటర్లలో వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి రిపోర్టులు ఇవ్వాలని ఆదేశించారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో మొబైల్ వాక్సినేషన్ వాహనాలు కూడా పని చేస్తూన్నాయని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకునెలా చూడాలని అధికారులకు సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుధీర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువెరియా తదితరులు పాల్గొన్నారు.