కలెక్టర్ దసరా శుభాకాంక్షలు

దసరా పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు.

బతుకమ్మ , దుర్గాష్టమి, దసరా పండుగలను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంతో కుటుంబ సభ్యులతో సంతోషంగా ఈ పండుగను నిర్వహించుకుంటారని, ఎక్కడ పనిచేసినా ఈ పండుగల సందర్భంగా వారి స్వస్థలాలకు చేరుకుంటారని దీనిని బట్టి ఈ పండుగకు తెలంగాణ ప్రజలు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అర్థమవుతుందని అన్నారు.

గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జిల్లాలో పుష్కలంగా వర్షాలు కురిసి జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు పూర్తిస్థాయి నీటి మట్టాలకు చేరుకున్నందున మంచి పంటల దిగుబడి వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు ఈ దసరాను మరింత ఉత్సాహంగా జరుపుకోనున్నారని తెలిపారు. అంతేకాక ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రభావం తగ్గడంతోపాటు అధిక సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్నందున చాలా తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. అందువల్ల ఈ దసరాను ప్రజలు గత సంవత్సరం కంటే ఉత్సాహంగా జరుపుకోనున్నారని పేర్కొన్నారు. అయితే ప్రజలు గుంపులు గుంపులుగా గుమికూడకుండా కనీస దూరం పాటిస్తూ బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కరోనా జాగ్రత్తలు తీసుకుంటేనే అన్ని కుటుంబాలు వారి కుటుంబ సభ్యులు క్షేమంగా సంతోషంగా ఉండగలుగుతారని, ప్రజలు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పండుగను ప్రశాంత వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని ఆయన కోరారు. 18 సంవత్సరాలు నిండిన వారిలో ఇంకా ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోకుంటే తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో సూచించారు.

Share This Post