కళాశాలలోని యువత పేర్లను ఓటర్ గా నమోదు చేయండి-జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

18 సంవత్సరాలు నిండి కళాశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి పేరు ఓటర్ జాబితాలో నమోదు చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో కళాశాల విద్యార్థులు ఓటర్ నమోదు పై ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ లతో సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత సంవత్సరం కోవిడ్ కారణంగా ఓటర్ జాబితాలో పేర్ల నమోదు తక్కువగా జరిగిందని, ఈ సంవత్సరంలో ఏ ఒక్క విద్యార్ధి 18 ఏళ్ళు నిండి ఓటర్ జాబితాలో పేరు నమోదు కాకుండా ఉండకూడదని, ప్రతి ఒక విద్యార్థి పేరును నమోదు చేయాల్సిన బాధ్యత ఆయా ప్రిన్సిపాల్ లపై ఉందని అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 18 ఏళ్ళు నిండిన యువతి, యువకుల పేర్లు తప్పనిసరిగా నమోదు చేయాలనీ అన్నారు. జిల్లా యంత్రాంగం అవసరమైన సహకారం అందిస్తుందని తెలిపారు. నమోదుకు కావలసిన నిర్ణిత ఫారాలను అందించడం జరుగుతుందని, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కూడా నమోదు చేయవచ్చని అన్నారు. ప్రతి కళాశాల అధ్యాపకులు వారి కళాశాలలో అర్హులైన యువతీ, యువకుల పేర్లను ఓటర్ జాబితాలో నమోదు చేయడం జరిగిందని ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని అన్నారు. మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, జిల్లాలోని 14 మండలాల్లో 22 డిగ్రీ, 33 జూనియర్ కళాశాలలు ఉన్నాయని తెలిపారు. 2022 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తైన వారి పేరును ఓటర్ గా నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. విద్యార్థులకు ఎన్నికలు, ఓటింగ్, తదితర అంశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. 2019-20 నుండి 2021-22 సంవత్సరాల నాటికీ చదివిన, చదువుతున్న విద్యార్థుల పుట్టిన తేదీలను సేకరించి ఓటర్ నమోదు చేయాలనీ సూచించారు. త్వరలో జరగనున్న పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు హాల్ టికెట్ కోసం కళాశాలలకు రావడం జరుగుతుందని, అదే సమయంలో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. విద్యార్థులు తన పాస్ పోర్ట్ సైజు ఫోటో, స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, తల్లి లేదా తండ్రి ఎపిక్ కార్డు లను వెంట తీసుకొని రావాల్సిందని విద్యార్థులకు ముందస్తు సమాచారం అందించాలని తెలిపారు. కొత్తగా చేర్చే పేరుకు సంబంధించి ఫారం-6, మార్పులకు ఫారం-8 లలో వివరాలు నమోదు చేయాలనీ తెలిపారు. ఈ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాష్ట్రంలోనే ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువమంది యువతను ఓటర్ జాబితాలో నమోదు అయ్యే విధంగా ప్రతి ఒక్క కళాశాల అధ్యాపకులు కృషి చేయాలనీ కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post