కళాశాలల్లో నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు కల్పించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

కళాశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన బోధన, మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కళాశాలల విద్య, వనరుల కేంద్రం కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కళాశాలలో చదివే విద్యార్థులకు భావిజీవితంలో అవసరమయ్యే విద్యాబోధన అందించాలని, అందుకు తగిన సౌకర్యాలు, శిక్షణలు ఇప్పించాలని సూచించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటి సంక్షేమ శాఖలకు సంబంధించిన వసతి గృహాలలో వసతులు కల్పించాలని అన్నారు. కళాశాల అధ్యాపకులు, సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఉపాధి కల్పన, జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించే పలు శిక్షణ కేంద్రాలలో శిక్షణలు ఇప్పించాలని సూచించారు. అదేవిధంగా పరిశ్రమల శాఖ ద్వారా పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే అవగాహన, ప్రోత్సాహకాలు, శిక్షణలు అందించాలని తెలిపారు. గత రెండు సంవత్సరాల నుండి కోవిడ్ కారణంగా విద్యార్థులు విద్యపై ద్రుష్టి సారించడకపోవడం జరిగిందని, ప్రస్తుతం విద్యార్థులు ద్రుష్టి విద్యపై కొనసాగేవిధంగా చూడాలని అన్నారు. అంతకుముందు ప్రభుత్వ డిగ్రీ సైన్సు కళాశాల ప్రిన్సిపాల్, కన్వీనర్ డా.రెహత్ ఖానం డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, విద్యార్థుల వివరాలు, అందిస్తున్న విద్యాబోధన, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధికల్పన అధికారి కిరణ్ కుమార్, సంక్షేమ శాఖల అధికారులు రాజలింగం, సంధ్యారాణి, సునీత, కృష్ణవేణి, వైస్ ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post